Asianet News TeluguAsianet News Telugu

వంకరగా గెలిచి విర్రవీగుతున్నారు: టీఆర్ఎస్ పై కొండా సురేఖ ఫైర్

టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ మహిళా ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు వంకరగా గెలిచి విర్రవీగుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ లతో, డబ్బు, మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేసి గెలుపొందారని ధర్మంగా గెలవలేదని ఆరోపించారు. 
 

congress senior leader konda surekha fires on trs
Author
Warangal, First Published Dec 19, 2018, 1:16 PM IST

వరంగల్: టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ మహిళా ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు వంకరగా గెలిచి విర్రవీగుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ లతో, డబ్బు, మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేసి గెలుపొందారని ధర్మంగా గెలవలేదని ఆరోపించారు. 

 డబ్బు మద్యం పంపిణీని అడ్డుకోవాల్సిన పోలీసులు సైతం వారికి సహకరించారని కొండా సురేఖ అన్నారు. ఇన్ని వంకర మార్గాల్లో ప్రయాణించింది కాబట్టే టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.  

హన్మకొండ రాంనగర్‌లోని తమ నివాసంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కొండా మురళీ, కొండా సురేఖలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ విజయంపై ప్రజల్లోనే అనుమానాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కేసీఆర్‌ పాలనపై వ్యతిరేకత పెల్లుబిక్కిందన్నారు. 
 
సొంతూరైన చింతమడక గ్రామంలోనే సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌ను ప్రజలు ఘోరావ్‌ చేసిన విషయాన్ని కొండా సురేఖ గుర్తుచేశారు. ఇలాంటి వ్యతిరేక పవనాలు ఉన్నా క్రమంలో అత్యధిక మెజారిటీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలువడం సందేహాలను మరింత బలోపేతం చేసిందన్నారు.
 
ఒక్కో నియోజకవర్గంలో రూ.30 నుంచి 50 కోట్ల మేరకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు డబ్బుల పంపిణీ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ వాళ్లను కనీసం కరపత్రాలు కూడా పంపిణీ చేయకుండా అడ్డుకున్నారని కొండా మురళీ ఆరోపించారు. కాంగ్రెస్‌ దిగ్గజాలు ఓడిపోతున్నారని కేటీఆర్‌ ఎలా చెప్పారని ప్రశ్నించారు. 

ఎవరిని ఓడించాలి, ఎవరిని గెలిపించాలో ముందుగానే నిర్ణయించారన్నారు. ఆ మేరకు ఈవీఎంల ట్యాంపరింగ్‌తో సఫలీకృతులయ్యారని ఆరోపించారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకే ఫెడరల్‌ ఫ్రెంట్‌ను సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేశారని కొండా దంపతులు విమర్శించారు.
 
మరోవైపు టీఆర్‌ఎస్ కు దమ్ముంటే రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో బ్యాలెట్‌ ఓటింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని కొండా దంపతులు డిమాండ్‌ చేశారు. ఈవీఎంలపై నమ్మకం సడలిందని, అమెరికా లాంటి దేశంలో కూడా బ్యాలెట్‌ ఓటింగ్‌ విధానం ఉందని ప్రస్తావించారు. 

గడిచిన ఐదేళ్లలో పరకాల అభివృద్ధి శూన్యమని కొండా దంపతులు దుయ్యబట్టారు. టెక్స్‌టెల్‌ పార్కు నిర్మాణం పేరిట ఎమ్మెల్యే ధర్మారెడ్డి 1200 ఎకరాల అసైన్డ్‌ భూమిని దక్కించుకున్నారని ఆరోపించారు. పరకాల ప్రజలు, కాంగ్రెస్‌ శ్రేణులకు తాము అండగా ఉంటామని కొండా దంపతులు స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ హామీలు అమలయ్యేలా పోరాటం చేస్తామని వెల్లడించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios