ఏం కేసీఆర్.. ఇప్పుడు తెలుస్తోందా నొప్పి..!!

గతంలోో కాంగ్రెస్ లోంచి బిఆర్ఎస్ లోకి ఎలాగయితే వలసలు సాగాయో... ప్రస్తుతం అలాగే బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి  జంపింగ్ లు సాగుతున్నాయి. ఈ ఫిరాయింపులపై కేసీఆర్, కేటీఆర్ చేస్తున్న కామెంట్స్ కు కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది.

Congress Party Strong counter to BRS Chief KCR AKP

Kavakuntla Chandrashekar Rao : కర్మ రిటర్న్స్... అంటే మనం చేసిన పనులే తిరిగి మనకు ఎదురవుతాయని. మంచి చేస్తే మంచి... చెడు చేస్తే చెడు జరుగుతుందని దీని సారాంశం. ఈ పదం ప్రస్తుతం తెలంగాణ మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. అధికారంలో వున్న గత పదేళ్లు ఇతరపార్టీలను దెబ్బతీసేందుకు కేసీఆర్ పిరాయింపులకు ప్రోత్సహించారు... ఇప్పుడు అవే ఫిరాయింపులు ఆయన కొంప ముంచుతున్నాయి. ఇటు రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్, అటు దేశంలో అధికారంలో వున్న బిజెపి కేసీఆర్ తో చెడుగుడు ఆడుకుంటున్నాయి. దీంతో బిఆర్ఎస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది.  

ఇప్పటికే అధికారాన్ని కోల్పోయిన ఢీలా పడ్డ భారత రాష్ట్ర సమితి పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు తయారయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మొదలు ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీలు, ప్రజా ప్రతినిధులు, నాయకులే కాదు కార్యకర్తలు కూడా ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఈ ఫిరాయింపులను ఎలా ఆపాలో అర్థంకాక ఆ పార్టీ అధినేత కేసీఆర్ తల పట్టుకుంటున్నారు. 

అయితే తాజాగా ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా కాంగ్రెస్ లో చేరారు. మరికొందరు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దంగా వున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇలా ప్రస్తుతం అసెంబ్లీలో స్పష్టమైన ఆధిక్యంలో వున్న కాంగ్రెస్ మండలిలో బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే గంపగుత్తగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. ఎమ్మెల్సీలు దండె విఠల్, ఎం.ఎస్ ప్రభాకర్, భానుప్రసాద్, బస్వరాజు సారయ్య,యెగ్గె మల్లేశం, దయానంద్ లు కారు దిగి హస్తం గూటికి చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ కు దగ్గరైన విషయం తెలిసిందే.

ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమి తర్వాత పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. కేసీఆర్ కు సన్నిహితులుగా పేరున్న బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ లిస్ట్  లో వున్నారు. అలాగే కేసీఆర్ హయాంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అయితే కాంగ్రెస్ లో చేరడమే కాదు తన కూతురు కావ్యను లోక్ సభ ఎన్నికల బరిలో నిలిపి బిఆర్ఎస్ ను చిత్తుగా ఓడించారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే  తెల్లం వెంకట్రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య,  జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లు బిఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ లో చేరారు. 

ఈ పిరాయింపుల్లో ఆసక్తికరమైనది కె. కేశవరావు కాంగ్రెస్ లో చేరడమే. బిఆర్ఎస్ అధికారంలో వుండగా కేసీఆర్ తో కేశవరావు ఎంత సన్నిహితంగా వుండేవారో అందరికీ తెలుసు. కేసీఆర్ బయటకు వచ్చాడంటే చాలు ఆయన వెంట కేశవరావు వుండేవారు. ఆయనను రాజ్యసభకు పంపి ఎంపీగా చేయడంతో పాటు కూతురు విజయలక్ష్మిని హైదరాబాద్ మేయర్ ను కూడా చేసారు కేసీఆర్. అయినా కేసీఆర్ ఇలా ఓడారో లేదో అలా తన కూతురుని ముందుగా కాంగ్రెస్ లోకి పంపి తాజాగా కేశవరావు కూడా అధికారికంగా హస్తం కండువా కప్పుకున్నారు.. తన ఎంపీ పదవికి రాజీనామా చేసారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త నయం... గౌరవప్రదమైన ఓట్లు,సీట్లు సాధించింది కేసీఆర్ పార్టీ. కానీ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం బిఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. ఈ  ఓటమిని ముందే గుర్తించిన సిట్టింగ్ ఎంపీలు రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, రాములు పార్టీ మారారు. వీరంతా బిఆర్ఎస్ మళ్లీ సీటు ఇస్తామన్నా కాదని వేరే పార్టీలో చేరారు. ఊహించినట్లుగానే తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా బిఆర్ఎస్ గెలవలేదు. దీంతో ఇక బిఆర్ఎస్ పని ఖతం అనే భావన ప్రజల్లో ఏర్పడింది.  

ఫిరాయింపులపై బిఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు... 

భారత రాష్ట్ర సమితి పార్టీనుండి కొనసాగుతున్న వలసలు అధినాయత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటివరకు ఒక్కొక్కరుగా పార్టీ మారితే తాజాగా గుంపులు గుంపులుగా బిఆర్ఎస్ ను వీడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే బిఆర్ఎస్ మిగిలేది కల్వకుంట్ల కుటుంబమే. వీరిలోనూ కేసీఆర్ మేనల్లుడు, మాజీ మంత్రి హరీష్ రావు ఎప్పటినుండో బిఆర్ఎస్ ను వీడతారనే ప్రచారం జరుగుతోంది. అవకాశం దొరికితే ఆయన కూడా పార్టీ మారతారు. కాబట్టి తండ్రి బిడ్డలు కేసీఆర్, కేటిఆర్, కవిత మాత్రమే బిఆర్ఎస్ లో మిగిలిపోతారని ప్రత్యర్థి పార్టీల నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. 

అయితే ఈ ఫిరాయింపులపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ... కాంగ్రెస్ లో చేరే ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతర పార్టీలో గెలిచిన నాయకులను సిగ్గులేకుండా చేర్చుకుంటున్నారంటూ కాంగ్రెస్ అధినాయకత్వం మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. దమ్ముంటే బిఆర్ఎస్ నుండి చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకత మొదలయ్యింది... అందువల్లే రేవంత్ వారితో రాజీనామా చేయించే సాహసం చేయడంటున్నారు. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన బిఆర్ఎస్ ను వీడుతున్నవారికి కాలమే గుణపాఠం  చెబుతుందని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. 

మాజీ సీఎం కేసీఆర్ కూడా పార్టీ మారిన ఎమ్మేల్యేలు, నాయకులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పార్టీలోంచి చెత్తంతా బయటకు పోతోందని...  అసలైన నాయకత్వమే మిగులుతుందని అంటున్నారు. బిఆర్ఎస్ ను వీడిన నాయకులు భవిష్యత్ లో పశ్చాత్తాప పడతారని అంటున్నారు. ఎవరు పార్టీని వీడినా కార్యకర్తల నుండే నాయకులను తయారుచేసుకునే సత్తా బిఆర్ఎస్ పార్టీకి వుందని అన్నారు. ఇలా నాయకుల పార్టీ పిరాయింపులను కేసీఆర్ తప్పుబడుతున్నారు. 

కాంగ్రెస్ నేతల కౌంటర్ :

ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ లో చేరడాన్ని కేసీఆర్, కేటీఆర్ లు తప్పుబడుతున్నారు. కానీ గతంలో వీరే కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ లో చేర్చుకున్న విషయాన్ని ఆ పార్టీల శ్రేణులు గుర్తుచేస్తున్నాయి. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుని ఏకంగా మంత్రులను చేసారు కేసీఆర్. మరి అప్పుడెందుకు రాజీనామా చేయించలేదని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తాము చేస్తే సంసారం... ఇతరులు చేస్తే వ్యభిచారం అనేలా తండ్రీకొడుకుల మాటలు వున్నాయంటూ మండిపడుతున్నారు. 

'నీవు నేర్పిన విద్యేగా నీరజాక్ష' అంటూ పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్ కు కౌంటర్ ఇస్తున్నారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు ప్రారంభించిందే కేసీఆర్... ఆయన బాటలోనే ప్రస్తుతం రేవంత్ రెడ్డి నడుస్తున్నారని అంటున్నారు. గతంలో ప్రతిపక్షాలే లేకుండా చేసేందుకు ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులెవ్వరినీ వదలలేదు కాదు... ఆ  బాధ ఎలా వుంటుందో ఇప్పుడు అర్థమవుతుందా కేసీఆర్ అంటూ చురకలు అంటిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios