రైతు ఆత్మగౌరవం కోసం కొట్లాడాల్సిన అవసరం వుందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి. శుక్రవారం భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్‌ను రేవంత్ కలిశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జెండాలు, అజెండాలు పక్కనబెట్టి రైతుల కోసం పోరాడాలన్నారు. తొలుత సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ తర్వాత ఢిల్లీలో నరేంద్ర మోడీని కలిసిన తర్వాత యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు.

ఈ చట్టాలను అమలు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలు, ఎఫ్‌సీఐ గోడౌన్లు, సీసీఐ కేంద్రాలు, కనీస మద్ధతు ధరను ఎత్తివేయడం జరుగుతుందన్నారు.

మోడీ పక్కనజేరిన కేసీఆర్ రైతులకు ఘోరి కట్టాలని భావిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు రాకేశ్ టికాయత్‌ మార్చి మొదటి వారంలో వస్తున్నారని.. ఆ రోజున భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. అణిచివేసే చర్యలు మంచిది కాదని.. రైతులు, రైతు సంఘాలతో చర్చించి ఆ చట్టాలను వ్యతిరేకించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.