శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీద తమకు నమ్మకం లేదన్నారు టీ.కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ. ఇవాళ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌ను కలిసిన ఆయన... టీఆర్ఎస్ఎల్పీలో కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేయాల్సిందిగా లేఖ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు సంతోష్ కుమార్, ఆకుల లలితపై వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్టాన్ని కాపాడాల్సిన వారే ఉల్లంఘిస్తున్నారని, గొర్రెల్ని కొన్నట్లు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొంటున్నారని ఆరోపించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే పేరా 4, షెడ్యూల్ 10 అని అంటున్నారని షబ్బీర్ అలీ తెలిపారు.  

శాసనమండలిలో సెపరేట్ సీటింగ్ కోసమే షెడ్యూల్ 10, పేరా 4ని ఏర్పరిచారని ఆయన గుర్తుచేశారు. పీసీసీకి తెలియకుండా, సమాచారం ఇవ్వకుండా మీటింగ్ పెట్టుకుంటే అది సీఎల్పీ సమావేశమవుతుందా అని షబ్బీర్ అలీ ప్రశ్నించారు.

తనను ప్రతిపక్షనేతగా తీసేశానని కేసీఆర్ సంతోషపడుతున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 రాష్ట్రాల్లో రుణమాఫీపై చర్యలు తీసుకున్నామని అలీ వెల్లడించారు. కానీ ఇక్కడ తండ్రీకొడుకులు విహార యాత్రలకు వెళ్తున్నారని షబ్బీర్ మండిపడ్డారు. తెలంగాణలో రాజ్యాంగానికి చీకటి దినాలు నడుస్తున్నాయని షబ్బీర్ అలీ దుయ్యబట్టారు.