టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన .. ఉద్యోగులకు మధ్యంతర భృతి లేదు, ఫిట్‌మెంట్ ఇవ్వడం లేదని విమర్శించారు.

ఫిట్‌మెంట్ ప్రకటించకుండా ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్‌కు లేదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్‌కు జాతీయ స్థాయిలో పెద్ద అబద్దాల కోరు అవార్డు ఇవ్వాలని ఆయన ధ్వజమెత్తారు.

లక్షా 91 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని పీఆర్సీ నివేదిక తెలిపిందని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. పదవీ విరమణ పొందినన్ని పోస్టులు కూడా భర్తీ చేయలేదని ఆయన గుర్తుచేశారు.

విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ లేదని, అలాంటప్పుడు కొత్త ఉద్యోగం ఇచ్చామని ఎలా చెబుతారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. రెగ్యులరైజ్ అయిన 22,629 మంది ఉద్యోగులకు బెనిఫిట్స్ రావడం లేదని జీవన్ రెడ్డి ఆరోపించారు.

సింగరేణిలో చెప్పిన 12 వేల ఉద్యోగాలు కూడా వారసత్వ ఉద్యోగాలేనని ఆయన స్పష్టం చేశారు. వేతనాలు చెల్లించలేక హర్టికల్చర్ శాఖలో 400 మందిని తొలగించారని జీవన్ రెడ్డి మండిపడ్డారు.

పంచాయతీ స్థాయిలో 40 వేల మంది దళిత ఫీల్డ్ అసిస్టెంట్‌లను తీసేశారని ఆయన ఆరోపించారు. రూ.25,00కి పనిచేసే స్కూల్ స్వీపర్లను కూడా తొలగించారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

50 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామని ఇప్పుడు చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రాగానే నోటిఫికేషన్ గుర్తుకొచ్చిందా అని జీవన్ రెడ్డి నిలదీశారు.

వాణి ఏనాడైనా తెలంగాణ జెండా పట్టారా .. వాణి, పల్లా ఇద్దరూ విద్యా వ్యాపారవేత్తలని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు వేలల్లో ఉద్యోగాలు వచ్చే గిరిజన యూనివర్సిటీ, ఐటీఐఆర్ ఇవ్వని బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.