ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లిన తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి అవమానం జరిగిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

ఆదివారం జగిత్యాలలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్‌తో పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డికి వీఐపీ గ్యాలరీలో మూడో వరుసలో కూర్చోపెట్టి అవమానించారని జీవన్ రెడ్డి తెలిపారు.

ప్రోటోకాల్ ప్రకారం సీఎం కంటే స్పీకర్ ముందుంటారు. తెలంగాణ స్పీకర్‌కు ఏపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం ఉంటే.. ఏపీ ప్రోటోకాల్ అధికారులు దీనిపై సమాధానం ఇవ్వాలని.. లేదనంటే ఇది స్పీకర్‌కు జరిగిన అవమానం కాదని యావత్ తెలంగాణకు జరిగిన అవమానమని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఇందుకు పూర్తి బాధ్యత వహిస్తూ స్పీకర్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వేదికపై ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్..పక్కన తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్‌ను కూర్చోబెట్టారని కనీసం కేసీఆర్‌కు అయినా ప్రోటోకాల్ విషయం తెలియదా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకోవడంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.