హైదరాబాద్: రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, గెలుపు అనేది శాశ్వతమనే రీతిలో సీఎం కేసీఆర్ సహా, టీఆర్ఎస్ నేతలు మాట్లాడడాన్ని మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క తప్పుబట్టారు. 

గురువారం నాడు గాంధీ‌భవన్‌లో మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును  గౌరవిస్తున్నట్టు భట్టి విక్రమార్క చెప్పారు. గెలుపు, ఓటములు సహజమన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడిన ప్రజలకు ఆయన  ధన్యవాదాలు తెలిపారు.

అధికారంలో ఉన్నా లేకపోయినా కూడ ప్రజల కోసం పనిచేస్తామని భట్టి  చెప్పారు.  2014, 2018 ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చేలా ప్రజల తరపున పోరాటం చేస్తామని  భట్టి చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని  ఆయన  పార్టీ క్యాడర్‌ను కోరారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి తెలుసుకొని మాట్లాడాలని  కేటీఆర్‌కు, టీఆర్ఎస్‌ నేతలకు హితవు పలికారు.

గెలుపు అనేది శాశ్వతం కాదని టీఆర్ఎస్ నేతలు గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరారు. అధికారంలోకి రానంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండదనే భావనను  కల్పించడాన్ని ఆయన తప్పుబట్టారు.

1994లో కేవలం 26 మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు  విజయం సాధించారని.. ఆనాడు పోరాటం చేసి త్వరలోనే ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆయన గుర్తు చేశారు.

పార్లమెంట్ ఎన్నికల్లో  తమిళనాడులో 40 సీట్లకు 1980లో డీఎంకె, కాంగ్రెస్ విజయం సాధించాయన్నారు.మూడు మాసాల్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంజీఆర్‌కు ప్రజలు పట్టం కట్టారని చెప్పారు.

ప్రతిపక్షాలపై కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడుడాన్ని ఆయన తప్పుబట్టారు.స్థానిక సంస్థల, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తాను చూపించాల్సిన అవసరం ఉందన్నారు. 

సీఎల్పీ నేత ఎన్నుకోవడం కోసం సరైన సమయంలో  పార్టీ అధినాయకత్వం ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకొన్న తర్వాత నిర్ణయిస్తారని చెప్పారు.
బెదిరించి, భయపెట్టి కేసీఆర్ తమను కంట్రోల్‌ చేయాలని భావిస్తున్నారా అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. చట్టపరంగా పాలన చేయాల్సిన సీఎం ఈ తరహలో మాట్లాడడం సరికాదన్నారు. ఎవరిని ఎవరు కక్కిస్తారోననే విషయాన్ని ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు.

ఎన్నికల్లో వైఫల్యాలపై లోతుగా చర్చించి నిర్ణయాన్ని  చెబుతామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమ పార్టీలో చేర్చుకొనే ప్రయత్నం కొంత కాలంగా టీఆర్ఎస్ చేస్తోందన్నారు. ఈ దఫా టీఆర్ఎస్‌లో చేరే ఎమ్మెల్యేలు ఎవరూ కూడ లేరని చెప్పారు.