హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  సోమవారం నాడు ఉదయం ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలోని పలువురు బీజేపీ అగ్రనేతలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసే అవకాశం ఉందని సమాచారం. బీజేపీలో  చేరాలని  రాజగోపాల్ రెడ్డి నిర్ణయం తీసుకొన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై  కాంగ్రెస్ పార్టీ  చర్యలు తీసుకోనే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సోమవారం నాడు సమావేశమై  నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

సోమవారం నాడు ఉదయం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి న్యూఢిల్లీకి వెళ్లారు.  ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిసే అవకాశం ఉందని సమాచారం. పీసీసీ చీఫ్ పదవిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశించారు.కానీ ఆయనకు ఈ పదవి దక్కదనే ఉద్దేశ్యంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాలని  భావిస్తున్నట్టుగా  సమాచారం.

ఇప్పటికే బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్‌తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చర్చించారని ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ నుండి బహిష్కరణకు గురి కావాలనే ఉద్దేశ్యంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ నాయకత్వంపై విమర్శలు చేశారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. పార్టీ నుండి బహిష్కరణకు గురైతే అసెంబ్లీలో బీజేపీ అనుబంధ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొనసాగే అవకాశం లేకపోలేదు.

మరో వైపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాల్సిన పరిస్థితి వస్తే... ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ సమయంలో రాజగోపాల్ రెడ్డికి బీజేపీ నాయకత్వం రాజ్యసభ సీటును కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం.