హైదరాబాద్: మాజీమంత్రి హరీశ్ రావుపై మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మంజీర, సింగూరు నీటి విషయంలో హరీష్ రావు తప్పు చేశారని ఆరోపించారు. జరిగిన తప్పును ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలని డిమాండ్ చేశారు. 

గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన హరీష్‌రావు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తప్పు చేశారు కాబట్టే తన వ్యాఖ్యలపై స్పందించ లేదని అన్నారు. నీటి పారుదల శాఖ సీఎం కేసీఆర్ వద్దే ఉండటం శుభపరిణామమన్నారు. 

ఇప్పటికైనా సింగూరు, మంజీర నీటి విషయంలో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇకపోతే కేబినేట్ లో ఎవరికి అవకాశం ఇవ్వాలో ఇవ్వకూడదో అన్నది సీఎం నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. 

సంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అనేది సీఎం ఇష్టానికే వదిలేస్తున్నట్లు తెలిపారు. తాను తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలవనని ఏదైనా మీడియా ద్వారానే చెబుతానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు.