కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వస్తే తప్పేంటని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈ నెల 21వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టుని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. కాగా... ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ , మహా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. కాగా... వీరిని ఆహ్వానించడంపై పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు  అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఈ విషయంపై జగ్గారెడ్డి స్పందించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ వస్తే తప్పేంటని ప్రశ్నించారు. కాళేశ్వరం నిర్మాణాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. ప్రాజెక్ట్‌లపై రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. మంచి పని ఎవరు తలపెట్టిన సమర్ధించాలన్నారు. తాను కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్ట్ ప్రారంభమైతే తన నియోజకవర్గంలో తాగు నీటి కష్టాలు తీరుతాయని స్పష్టం చేశారు. 

ప్రాజెక్ట్‌లు ఎవరు కట్టినా తెలంగాణ ప్రజల కోసమేనని పేర్కొన్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడం వల్ల కేసీఆర్ సీఎం అయ్యి కాళేశ్వరం కట్టే అవకాశం వచ్చిందని వెల్లడించారు. కాళేశ్వరం అవినీతి గురించి తాను మాట్లాడనన్నారు. ఆ విషయం భట్టి విక్రమార్క చూసుకుంటారన్నారు.