కమ్యూనిస్టులతో పొత్తుపై భట్టి సంచలన వ్యాఖ్యలు
కమ్యూనిస్టులతో పొత్తుల అంశంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే.. దళితుడిని ముఖ్య మంత్రి చేస్తాననీ, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని గులాబీ అధినేత కేసీఆర్ మోసపూరిత ప్రకటనలతో నమ్మించి, అధికారంలోకి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసమ్మతి నేతల పార్టీ ఫిరాయింపులు, పార్టీల పొత్తులతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. జనసేన, షర్మిల పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉండటం. ఇక కమ్యూనిస్టులకు కాంగ్రెస్ రిక్తహస్తం చూపడం మరో చర్చనీయ ఆంశంగా మారింది. ఈ తరుణంలో కమ్యూనిస్టులతో పొత్తుల అంశంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు విషయంపై వామపక్షాలతో జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నదని అన్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని పేర్కొన్నారు.
గాంధీ భవన్‌లో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క గట్టి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ ఎక్కడ పోటీ చేయాలనేది అసదుద్దీన్‌కు అవసరం లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒవైసీ తన ఎంఐఎం అభ్యర్థులను చూసుకుంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు. అలాగే.. కాంగ్రెస్‌కి షర్మిల మద్దతు ఇవ్వడం సంతోషమని అన్నారు. వైఎస్సార్ కూతురుగా షర్మిల సరైన నిర్ణయం తీసుకుందని, ఆమె నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు.
సీఎం కేసీఆర్ మోసపూరితమైన ప్రకటనలతో దళితులను మోసం చేస్తున్నారని, సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలో రమాకాంత్ అనే దళిత యువకుడి ఆత్మహత్యకు కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ధ్వజమెత్తారు. దళితుడిని ముఖ్య మంత్రి చేస్తాననీ, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని గులాబీ అధినేత కేసీఆర్ మోసపూరిత ప్రకటనలతో నమ్మించి, అధికారంలోకి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితబంధు పేరుతో రూ.10 లక్షలు ప్రకటిస్తే.. ఓట్లు వేసిన ప్రజలకు బీఆర్ఎస్ మోసం చేసిందని, బడ్జెట్‌లో దళిత బందు కింద రూ.17,700 కోట్లు కేటాయించి..కనీసం రూ.300 కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. అలాగే.. కాంగ్రెస్ పార్టీ తీసుకవచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను సీఎం కేసీఆర్ పక్క దారి పట్టించిందని మండిపడ్డారు.