హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావడంపై  ఆ పార్టీ జాతీయ నాయకత్వం సమీక్ష నిర్వహించనుంది. ఈ సమీక్షకు ఢిల్లీకి రావాల్సిందిగా ముఖ్య నేతలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో  టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాలకే పరిమితమైంది.
కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావడంపై  సమీక్ష నిర్వహించాలని ఆ పార్టీ నాయకులు కొందరు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. గెలిచిన అభ్యర్థులతో పాటు ఓడిపోయిన అభ్యర్థులను పిలిచి సమీక్ష నిర్వహించాలని కొందరు పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ  ఘోరంగా ఓటమి పాలు కావడంపై  ఈ నెల 26వ తేదీన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం సమీక్ష నిర్వహించనుంది.ఈ సమీక్షలో  పార్టీ ఓటమికి గల కారణాలపై కారణాలను తేల్చనున్నారు.

విపక్షాలతో కూటమిని ఏర్పాటు చేసి  ఎన్నికల్లో పోటీ చేసినా కూడ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో  19 స్థానాలకే పరిమితమైంది.ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ ఓటమిపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని  ఆ పార్టీ  నేతలు కొందరు అభిప్రాయంతో ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నేతలు  ఈ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం కూడ ఆ పార్టీ నాయకత్వానికి మింగుడు పడడం లేదు. ఈ పరిణామాలన్నింటిపై కాంగ్రెస్ నాయకత్వం చర్చించనుంది. 

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కూడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆ పార్టీ నాయకత్వం అసంతృప్తితో ఉంది. ఈ సమీక్ష తర్వాత కాంగ్రెస్  పార్టీలో కీలకమైన మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే  వరుసుగా రెండు దఫాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన  ప్రజా ప్రతినిధులకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  గాలం వేస్తున్నారు ఈ తరుణంలో పార్టీని  ఈ ఐదేళ్ల పాటు దూకుడుగా నడిపించే నాయకత్వం అవసరమని  ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు అభిప్రాయంతో ఉన్నారు. 

ఈ సమీక్ష తర్వాత పార్టీలో కీలకమైన మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు ఉన్నాయని  చెబుతున్నారు. పీసీసీ నాయకత్వంలో కూడ మార్పులు చేర్పులు చోటు చేసుకొనే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.