హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వెల్లడిలో జరిగిన అవకతవకలపై హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద శనివారం నిర్వహించిన ప్రతిపక్షాల ధర్నాలో అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. కాంగ్రెసు నేతలు ఇద్దరు బాహాబాహీకి దిగారు. కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు, మరో నేత నగేష్ ఘర్షణ పడ్డారు. 

విహెచ్, నగేశ్ పరస్పరం కొట్టుకున్నారు. ధర్నా వేదిక వద్ద కుర్చీ కోసం వారిద్దరు తోపులాటకు దిగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. నగేష్ తన కుర్చీని కాంగ్రెసు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ కుంతియాకు ఇచ్చారు. దీంతో విహెచ్ తీవ్రంగా మండిపడ్డారు.

నగేష్ తీరును విహెచ్ తప్పు పట్టారు. వారిద్దరినీ వారించడానికి అక్కడున్న నేతలు ప్రయత్నించారు. ధర్నా వేదిక వద్ద తెలుగుదేశం తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్వీ రమణతో పాటు ఇతర ప్రతిపక్షాల నాయకులు కూడా ఉన్నారు. 

ఇంటర్ ఫలితాల్లో అవతకవకలపై ప్రతిపక్షాలు శనివారం ఇందిరా పార్కు వద్ద ధర్నాకు దిగాయి. కాంగ్రెసు నేతలతో పాటు తెలుగుదేశం, తదితర పార్టీల నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.