హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సెటైర్లు వేశారు కాంగ్రెస్ నేత విజయశాంతి. కేటీఆర్ దేశభక్తి వ్యాఖ్యలపై పంచ్ లు వేశారు. తన వరకు వస్తే కానీ అసలు తత్వం బోధపడదు అన్న చందంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ విరుచుకుపడ్డారు. 

మాతో ఉంటే దేశభక్తులు లేకపోతే దేశద్రోహులు అన్న చందంగా బిజెపి రాజకీయం చేస్తోందని కేటీఆర్ చాలా భావోద్వేగంతో కామెంట్ చేయడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆరోపించారు.  

గత ఐదేళ్ళ కాలంలో టిఆర్ఎస్ అధిష్టాన వైఖరిని చూస్తుంటే తమతో  కలిసి ఉన్నవారే తెలంగాణ వాదులు లేనివారు తెలంగాణ ద్రోహులు అనే విధంగా నియంతృత్వ ధోరణి కనిపించిందన్నారు.  

నేడు కేటీఆర్ వ్యక్తపరిచిన అభిప్రాయం ఎలా ఉందో సరిగ్గా అదే అభిప్రాయంతోనే ఇంతకాలం ప్రతిపక్షాలన్నీ అంతర్మథనం తోను ఆవేదనతోను కొట్టుమిట్టాడుతున్నాయిని తెలిపారు. ఇప్పటికైనా అసలు తత్వం టిఆర్ఎస్ అధిష్టానానికి బోధ పడినందుకు సంతోషమంటూ ఎద్దేవా చేశారు. 

రాబోయే రోజుల్లోనైనా టిఆర్ఎస్ అగ్రనాయకత్వం తన వైఖరిని మార్చుకోవాలని ప్రతిపక్షాలు తో పాటు తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి సూచించారు.