హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాదు... నల్గొండ కాంగ్రెస్ పార్టీ....  అంటూ ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు  తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీకి నష్టం చేసే నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.

ఆదివారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో అరువు తెచ్చుకొన్న నేతల వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.

పార్టీని బ్లాక్‌మెయిల్ చేసిన నేతలను ఉపేక్షిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వీహెచ్ పరోక్ష విమర్శలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్  పార్టీ  కాదు... నల్గొండ  కాంగ్రెస్ పార్టీ అంటూ ఆయన సెటైర్లు వేశారు.  

టిక్కెట్ల కోసం పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తారు. నల్గొండ కాంగ్రెస్ నేతల వల్లే పరిస్థితి నెలకొందన్నారు. బీజేపీలో చేరుతానని ప్రకటించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. 

కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూస్తే తనకు బాధ కలుగుతోందన్నారు. పారాచ్యూట్ నేతలకు టిక్కెట్లు ఇవ్వొద్దని రాహుల్ గాంధీ చెప్పినా కూడ రాష్ట్రంలో టిక్కెట్లను కేటాయించారని  ఆయన గుర్తు చేశారు.