తనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీ.కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్. రౌడీలందరిని ముందుంచి మాట్లాడిస్తున్నారంటూ మంత్రి కేటీఆర్‌పైనా శ్రవణ్ మండిపడ్డారు.

ఆకు రౌడీలు చెబితే గ్రాడ్యుయేట్లు ఓట్లు వేస్తారా అంటూ ప్రశ్నించారు. తాను గొట్టంగాన్ని కాదని.. డబుల్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ చేశానని, ఉస్మానియాలో ప్రొఫెసర్‌గా, పెద్ద ఐటీ కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పనిచేశానని శ్రవణ్ పేర్కొన్నారు.

ఆత్మగౌరవాన్ని అమ్ముకున్న తలసాని ఈరోజున ఎథిక్స్, వాల్యూస్ గురించి మాట్లాడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. చీమలు పెట్టిన పుట్టలోకి పాములు జోరబడినట్లు.. ఉద్యమకారులు కష్టపడి నిర్మించిన టీఆర్ఎస్‌ పార్టీలో తలసాని లాంటి వాళ్లు ఆధిపత్యం సాగిస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు.

Also Read:తెలంగాణకు వ్యతిరేకమని చిరు, పవన్‌లనే వద్దనుకున్నా: దాసోజు శ్రవణ్

తెలంగాణ కోసం పోరాడిన కట్టెల శ్రీనివాస్ యాదవ్ ఎక్కడున్నాడు.. ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎక్కడున్నాడో కేటీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. 2014 టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను తాను, కేసీఆర్ కలిసి ప్రజెంట్ చేశామని నేను గొట్టంగాడిని అవునో కాదో మీ బాస్‌ని అడగాలని శ్రవణ్ చెప్పారు.

పదో తరగతి ఫెయిల్ అయినవాళ్లతో వాణి దేవికి ఓటు వేయమని ప్రచారం చేయించొద్దని కేటీఆర్‌కి హితవు పలికారు. ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే తాము లక్షన్నరకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని శ్రవణ్ గుర్తుచేశారు.

వీటిలో 84 వేల ఉద్యోగాలు కొత్తగా సృష్టించినవని ఆయన తెలిపారు. వీటితో పాటు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే రూ.770 కోట్లు ఖర్చు పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 5 లక్షల మందికి శిక్షణ ఉపాధి కల్పించామని శ్రవణ్ పేర్కొన్నారు.