12 మంది వలస నేతలకు కాంగ్రెస్ టిక్కెట్లు:నాగం, మర్రికి నిరాశే

ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరిన  12 మంది వలస నేతలకు  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లను కేటాయించింది.  టిక్కెట్ల కేటాయింపుపై హామీతోనే  కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల నుండి నేతలు చేరారు.

Congress Denies  Ticket To Nagam Janardhan Reddy lns


హైదరాబాద్: ఇటీవలనే కాంగ్రెస్ పార్టీలో చేరిన 12 మంది నేతలకు  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల కేటాయింపులో పెద్దపీట వేసింది.  గెలుపు గుర్రాలకే టిక్కెట్ల కేటాయింపు ప్రక్రియలో  భాగంగా  వలస నేతలకు  టిక్కెట్లను కేటాయించాల్సి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నేతలు  చెబుతున్నారు. ఇదిలా ఉంటే  ఇప్పటివరకు  కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలను పక్కన పెట్టి  వలస నేతలకు  టిక్కెట్లకు కేటాయించడం చర్చకు దారి తీసింది.  వలస నేతల కారణంగా  సీనియర్లకు కూడ టిక్కెట్లు దక్కలేదు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  టీడీపీ అభ్యర్థిగా వరుస విజయాలు సాధించిన  నాగం జనార్ధన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మొండిచేయి చూపింది.  ఇటీవల పార్టీలో చేరిన  కూచుకుళ్ల రాజేష్ రెడ్డికి పార్టీ టిక్కెట్టు కేటాయించింది.  టిక్కెట్టు కేటాయించాలని కోరుతూ  నాగం జనార్థన్ రెడ్డి  మూడు రోజుల క్రితం గాంధీ భవన్ లో తన అనుచరులతో ఆందోళన నిర్వహించారు. టిక్కెట్టు దక్కదనే సంకేతాలు రావడంతో  నాగం జనార్థన్ రెడ్డి సహా ఆయన అనుచరులు గాంధీ భవన్ లో  ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన తర్వాత  అనుచరులతో  నాగం జనార్ధన్ రెడ్డి ఆయన తనయుడు  సమావేశాలు నిర్వహిస్తున్నారు.

సనత్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి మర్రి ఆదిత్య రెడ్డి కాంగ్రెస్ టిక్కెట్టు ఆశిస్తున్నారు. తండ్రి మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరినా కూడ  ఆదిత్యరెడ్డి  కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.సనత్ నగర్ అసెంబ్లీ నుండి కాంగ్రెస్ టిక్కెట్టును ఆశించారు. కానీ  మర్రి ఆదిత్యరెడ్డికి కాకుండా కోట నీలిమకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది.

ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ స్థానాల నుండి ఇటీవలనే పార్టీలో చేరిన  వినయ్ కుమార్ రెడ్డి, సునీల్ కుమార్ లకు  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు కేటాయించింది. మెదక్, మల్కాజిగిరి  స్థానాల నుండి  మైనంపల్లి రోహిత్, మైనంపల్లి హన్మంతరావులకు టిక్కెట్లు దక్కాయి. బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన  మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్  కు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు దక్కింది. జహీరాబాద్ నుండి  చంద్రశేఖర్ బరిలోకి దిగనున్నారు. గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్న సరిత తిరుపతయ్య ఇటీవలనే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు.  గద్వాలలో సరిత తిరుపతయ్యకు  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు దక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవలనే పార్టీలో చేరారు.  ఆయనకు  కల్వకుర్తి అసెంబ్లీ  స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. గతంలో ఇదే అసెంబ్లీ స్థానం నుండి వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన విషయం తెలిసిందే. నకిరేకల్ నుండి  వేముల వీరేశాన్ని కాంగ్రెస్ టిక్కెట్టు దక్కింది.

 2014లో ఇదే అసెంబ్లీ స్థానం నుండి  బీఆర్ఎస్ అభ్యర్థిగా వేముల వీరేశం విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.  కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించిన చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.దీంతో  వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు దక్కింది.  మరో వైపు నిర్మల్ అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన  శ్రీహరి రావుకు  టిక్కెట్టు దక్కింది.

also read:ఉత్తమ్‌, మైనంపల్లి కుటుంబాలకు రెండేసి టిక్కెట్లు: జానారెడ్డి కుటుంబానికి లక్కు దక్కేనా?

ఈ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీంతో  విజయం సాధించే అభ్యర్థులకే  టిక్కెట్లను కేటాయించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కనుగోలు సర్వేకు అనుగుణంగా టిక్కెట్ల కేటాయింపు జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఈ కారణంగానే  ఇతర పార్టీల నుండి వలస వచ్చిన నేతలకు  పార్టీ టిక్కెట్లు కేటాయించింది.

కాంగ్రెస్ టిక్కెట్టు దక్కించుకున్న వలస నేతలు వీరే

1.ఆర్మూర్-  వినయ్ కుమార్ రెడ్డి
2.బాల్కొండ -  సునీల్ 
3.మెదక్-  మైనంపల్లి రోహిత్
4.జహీరాబాద్-  చంద్రశేఖర్
5.మల్కాజిగిరి-  మైనంపల్లి హన్మంతరావు
6.సనత్ నగర్-  కోట నీలిమ
7.గద్వాల - సరిత తిరుపతయ్య
8.నాగర్ కర్నూల్-  కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
9.కల్వకుర్తి-  కసిరెడ్డి నారాయణరెడ్డి
10.కొల్లాపూర్-  జూపల్లి కృష్ణారావు
11.నకిరేకల్ - వేముల వీరేశం
12.నిర్మల్-శ్రీహరి రావు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios