రైతు దీక్ష సందర్భంగా టీఆర్ఎస్‌ పార్టీలోని నేతల మధ్య వున్న విభేదాలు బయటపడుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతుండగా.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆమె చేతిలోని మైక్‌ను లాక్కొన్నారు. 

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో (mahabubabad district) టీఆర్ఎస్ పార్టీ (trs) తలపెట్టిన రైతు దీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్ (minister satyavathi rathod) సమక్షంలోనే నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎంపీ మాలోత్ కవిత.. (maloth kavitha) రైతు దీక్షలో మాట్లాడుతుండగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ (mla shankar naik) మైక్ లాక్కొన్నారు. దీంతో బిత్తరపోయిన కవిత కింద కూర్చొని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావుకు ఫిర్యాదు చేశారు. అటు వరంగల్ జిల్లాలోనూ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మంత్రి దయాకర్ (errabelli dayakar rao) పాల్గొన్న రైతు దీక్షకు స్థానిక ఎమ్మెల్యే, కార్యకర్తలు డుమ్మాకొట్టి ఇంట్లో కూర్చొన్నారు. దయాకర్ రావు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత తీరిగ్గా సభా వేదిక వద్దకు చేరుకున్నారు ఎమ్మెల్యే. 

అంతకుముందు రైతు దీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రైతు రాజు అయ్యాడని పేర్కొన్నారు. రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించడం జీర్ణించుకోలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సత్యవతి ఆరోపించారు. దీనిలో భాగంగానే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతోందని ఆమె మండిపడ్డారు. 

రాజకీయంగా మనం ఏ స్థాయి నాయకులమైనా ముందుగా రైతు బిడ్డలమని సత్యవతి గుర్తుచేశారు. వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని జీవిస్తున్నామని తెలిపారు. రైతు సంతోషంగా ఉంటే, రెండు పంటలు పండిస్తే దేశంలోని అందరూ కడుపు నిండా అన్నం తింటారని సత్యవతి రాథోడ్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వివక్షకు గురైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడితే ఇక్కడి రైతు సంతోషంగా ఉంటాడని, నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో కేసీఆర్ ఉద్యమం చేపట్టి రాష్ట్రం సాధించారని గుర్తుచేశారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అనతి కాలంలోనే దేశానికి అన్నపూర్ణగా మార్చారని సత్యవతి కొనియాడారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తున్నామని.. ఇదంతా ప్రతిపక్షాలకు నచ్చడం లేదంటూ ధ్వజమెత్తారు. 

కేంద్రం తన తప్పు తెలుసుకుని తెలంగాణ రైతులు పండించిన యాసంగి పంటను కొనేవరకు ఈ ఉద్యమం ఆగదని సత్యవతి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు ఈ ఉద్యమం కొనసాగించాలని రైతు బిడ్డగా కోరుతున్నానని చెప్పారు . బీజేపీ వ్యతిరేక దీక్ష మొదలైందని.. ఓపిక ఉన్నంత వరకు, బీజేపీ కళ్లు తెరిచే వరకు దీనిని కొనసాగిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు.