తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ఒక ప్రత్యేకత ఉంది.. రాష్ట్రంలో మానవీయ కోణంలో పథకాలు: కేసీఆర్
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ఒక ప్రత్యేకత ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 1948లో ఇదే రోజు తెలంగాణ రాచరికం ముగిసి ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైందని గుర్తుచేశారు.

తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ఒక ప్రత్యేకత ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 1948లో ఇదే రోజు తెలంగాణ రాచరికం ముగిసి ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైందని గుర్తుచేశారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించుకున్న జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి.. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘భారతదేశంకు స్వాతంత్ర్యం సిద్దించిన తర్వాత.. బ్రిటిష్ పరిపాలనకు వెలుపల రాజుల ఏలుబడిలో ఉన్న సంస్థానాలను భారత యూనియన్‌లో కలిపే ప్రక్రియను నాటి భారత ప్రభుత్వం చేపట్టింది.
అందులో భాగంగా మన హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో అంతర్భాగం అయింది. ఈ పరిణామంతో తెలంగాణ రాచరికం ముగిసిపోయి.. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిపాలన ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుకోవడం సముచితమని తెలంగాణ ప్రభుత్వం భావించింది. అందుకే ఈరోజున రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండాలను ఎగరవేయడం జరుగుతుంది’’ అని చెప్పారు.
తెలంగాణ నేలపై అనేక పోరాటాలు జరిగాయని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. న్యాయం కోసం, ధర్మం కోసం, రాజ్యాంగ హక్కుల కోసం ప్రాణాల సైతం తృణపాయంగా భావించి తెలంగాణ సమాజం గుండెలు ఎదురొడ్డి నిలిచిందని అన్నారు. ఆనాటి సామాన్య ప్రజల పోరాట ఘట్టాలు జాతి తలుపుల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయని చెప్పారు. దొడ్డి కొమురయ్య నుంచి చాకలి ఐలమ్మ దాకా, కొమురం భీం నుంచి రావినారాయణరెడ్డి దాకా, షోయబుల్లా ఖాన్ నుంచి సూరవరం ప్రతాప్ రెడ్డి దాకా, స్వామి రామానంద తీర్థ నుంచి జమలపురం కేశవరావు దాకా, బండి యాదగిరి నుంచి సుద్దాల హనుమంతు, కాళోజీ, దాశరథి వరకు ఎందరో చిరస్మరణీయులకు జాతీయ సమైక్యత దినోత్సవం వేళ నివాళులర్పిస్తున్నట్టుగా చెప్పారు.
మహాత్మ గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నేతలు చేసిన కృషి వల్లే ప్రస్తుత భారతదేశం సాధ్యమైందని అన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంలో మారిన తర్వాత.. 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రంగా వెలుగొందిందని అన్నారు. ఆ తర్వాత తెలంగాణ ప్రజల ఆలోచనలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి, ప్రజానీకానికి తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మహోద్యమానికి నాయకత్వం చరిత్ర తనకు అందించిన మహదవకాశమని కేసీఆర్ పేర్కొన్నారు.
స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే గురుతర బాధ్యతను కూడా ప్రజలు తన భుజస్కంధాలపైనే ఉంచారని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రం సాకారమైన నాటి నుంచి తెలంగాణ జరుగుతున్న సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలు యావద్దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. స్వాతంత్య్రం సాధించిన 76 ఏళ్ల తర్వాత కూడా పేదరికం, నిరుద్యోగం, సాంఘిక వివక్ష దేశాన్ని పట్టిపీడిస్తుండటం దురదృష్టకరమని అన్నారు. తెలంగాణలో మానవీయ కోణంలో పథకాలు రూపొందించి ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర సత్వరాభివృద్ధితోపాటు సంపద పెంచాలి.. పెరిగిన సంపదను అవసరమైన వర్గాల ప్రజలకు పంచాలి అన్న ధ్యేయంతో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో నేడు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందని కుటుంబమేదీ లేదని ఘంటాపథంగా చెప్పవచ్చని అన్నారు. ప్రభుత్వ పథకాల ఫలితంగానే నేడు రాష్ట్రంలో పేదరికం తగ్గి, తలసరి ఆదాయం పెరిగిందని తెలిపారు. 2015-18 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం, 2019-21 నాటికి 5.88 శాతానికి దిగివచ్చిందని చెప్పారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను, అవి విజయవంతం అయినా తీరును కేసీఆర్ ఈ సందర్భంగా వివరించారు.