Asianet News TeluguAsianet News Telugu

నిర్మల్‌కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు: భారీ వర్షాలసై మంత్రులు, అధికారులకు కేసీఆర్ ఆదేశాలు


తెలంగాణ రాష్ట్రంలో వరద పరిస్థితిని గురువారం నాడు సీఎం కేసీఆర్ సమీక్షించారు. నిర్మల్ పట్టణానికి ఎన్డీఆర్‌ఎప్ బృందాలను పంపాలని సీఎస్ ను ఆదేశించారు. నిజామాబాద్ లో వరద పరిస్థితులను సమీక్షించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఆదేశించారు. 

CM KCR reviews on heavy rains in Telangana lns
Author
Hyderabad, First Published Jul 22, 2021, 12:59 PM IST


హైదరాబాద్: రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్  అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలతో ఆయా జిల్లాల్లో పరిస్థితులను సీఎం కేసీఆర్ గురువారం నాడు సమీక్షించారు. భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ ఎగువనుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో  వరద ఉదృతి పెరుగుతున్నందున యుద్ద ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజాప్రతినిధులను, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. 

బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో  భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తక్షణమే  ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డిని సిఎం కెసిఆర్ కోరారు. ఇప్పటికే నిర్మల్ పట్టణం నీటమునిగిందని అక్కడికి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను తక్షణమే పంపాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సిఎం ఆదేశించారు.ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లను ,ఎస్పీలను, రెవిన్యూ అధికారులు, ఆర్ అండ్ బీ శాఖ అధికారులను కోరారు.

 గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇండ్లల్లోంచి బయటకు రావద్దని సిఎం కెసిఆర్ సూచించారు. వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్ననేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.గోదావరితో పాటు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో మన రాష్ట్రంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని సీఎం గుర్తు చేశారు. 

 తెలంగాణలోకి వరద ఉదృతి పెరగనున్నదని  గోదావరి కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు  తమ జిల్లాల్లో తమ తమ నియోజకవర్గాల్లో వుంటూ ఎప్పటికప్పుడు వరద పరిస్థిని సమీక్షిస్తూ వుండాలన్నారు.ఈ ప్రాంతాల అన్నిస్థాయిల లోని టిఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు తెలంగాణ భవన్ కు అందుబాటులో ఉంటూ పరిస్థితులను సమీక్షిస్తుండాలన్నారు.

 గోదావరి కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని అధికారులతో పాటు మొత్తం టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి మంత్రుల దాకా, పార్టీ కార్యకర్తలు నేతలంతా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సిఎం ఆదేశించారు.రానున్న రెండు రోజులు అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున  ప్రజా ప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios