Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ మేనిఫెస్టో: పెన్షన్ డబుల్,నిరుద్యోగ భృతి,మళ్లీ రుణమాఫీ,రైతు బంధు పెంపు

తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు అధ్యక్షతన ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీకి వచ్చిన వినతులు, సూచనలు సలహాలపై సమావేశంలో రెండు గంటల పాటు చర్చించినట్లు కేసీఆర్ తెలిపారు. పక్కా లెక్కలతోనే మేనిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు. 

cm kcr released partial manifesto in telangana bhavan
Author
Hyderabad, First Published Oct 16, 2018, 6:04 PM IST

హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు అధ్యక్షతన ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీకి వచ్చిన వినతులు, సూచనలు సలహాలపై సమావేశంలో రెండు గంటల పాటు చర్చించినట్లు కేసీఆర్ తెలిపారు. పక్కా లెక్కలతోనే మేనిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు. 

ఓట్లు కోసం, ప్రలోభాల కోసం కాకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. గత నాలుగేళ్ల అనుభవాలను పరిగణలోకి తీసుకుని మేనిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు. మేనిఫెస్టోకమిటీకి 300కు పైగా వినతులు అందాయని తెలిపారు. కొన్ని పార్టీలకు ఎన్నికలు అంటే ఆట అయితే టీఆర్ఎస్ పార్టీకి ఒక టాస్క్ అన్నారు. 

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సహకారం అందించలేదని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదని తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రభుత్వ పథకాలకు నీతి ఆయోగ్ రూ.24వేల కోట్లు నిధులు మంజూరు చెయ్యాలని సూచించినా కనీసం రూ.24 కూడా ఇవ్వలేదన్నారు. 

ఐదేళ్లలో తిరిగి చెల్లించాల్సిన అప్పు 2లక్షల 30వేల కోట్లు అని కేసీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి బాట పరుస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ పునర్మాణానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మిషన్ కాకతీయ పేరుతో చెరువులు పునరుద్ధరించామని తెలిపారు. కోటి ఎకరాలకు నీరందించాలన్న లక్ష్యంతో పనిచేశామని అందులో 100శాతం విజయవంతం అయ్యామన్నారు. రెండేళ్లలో కోటి ఎకరాలకు సాగునీరందిస్తామని ధీమా వ్యక్తం చేశారు.  

ప్రాజెక్టుల విషయంలో కొంతమంది నేతలు అడ్డుపడ్డారని కోర్టుల్లో కేసులు వేశారని అయినా ఎక్కడా వెనకడుగు వెయ్యలేదన్నారు. ప్రాజెక్టులకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎదురొడ్డుతామన్నారు. తెలంగాణలో రైతును రాజు చెయ్యాలన్న కృత నిశ్చయంతో వ్యవసాయ రుణాన్ని రద్దు చేశానన్నారు. అలాగే ట్రాక్టర్లకు లోన్ రద్దు చేశామని, నీటి తీరువా పన్ను కూడా రద్దు చేశామన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన చేశామని తెలిపారు. రైతు బంధు పథకం ఒక అద్భుతమైన పథకమని ప్రపంచ వ్యాప్తంగా దీనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. 

24 గంటలు నాణ్యమైన విద్యుత్ ను పంపిణీ చేసిన ఘన టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. భారతదేశంలోనే ఏ రాష్ట్రం కూడా 24 గంటలు విద్యుత్ అందించిన దాఖలాలు లేవన్నారు. రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 45.5 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారని 42లక్షల మంది లక్ష రూపాయలు లోను తీసుకున్నవారని తెలిపారు. 

లక్ష రూపాయలు రైతు రుణమాఫినీ రెండు దఫాలుగా చేస్తామని తెలిపారు. రైతు బంధు పథకం కింద ఎకరానికి సంవత్సరానికి రూ.10వేలు చెల్లిస్తామని తెలిపారు. రైతు సమన్వయ సమితులను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. రైతు సమన్వయ సమితులకు గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. 

నియోజకవర్గానికి రెండు చొప్పున ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఐకేపీ ఉద్యోగులకు ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ బాధ్యత అప్పగించనున్నట్లు తెలిపారు. 70శాతం రుణాలతో ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.  

రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఆర్థిక విధానం తెలియకపోవడంతో 65 ఏళ్లలోపు వాళ్లకి పెన్షన్ విధానం అమలు చేశామని తెలిపారు. 57 సంవత్సరాలు దాటిన వారందరికీ  ప్రతీ ఒక్కరికి పెన్షన్ అందజేస్తాం. దీనివల్ల 8లక్షల మంది అదనంగా లబ్ధి పొందనున్నట్లు తెలిపారు. వితంతువులకు వికలాంగులకు రూ.3016, ఆసరా పెన్షన్లు 1000 నుంచి 2016రూపాయలకు పెంచినట్లు కేసీఆర్ తెలిపారు. 

నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ప్రతి నెల నిరుద్యోగులకు రూ.3016 నిరుద్యోగ భృతి చెల్లిస్తామని కేసీఆర్ తెలిపారు. 100శాతం సబ్సిడీతో ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. రెండు తరాల వరకు గృహం సమస్య లేకుండా ఉండేలా పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేస్తామని చెప్పారు. 2లక్షల 60వేల డబుల్ బెడ్ రూంల ఇళ్లు నిర్మించి తీరుతామన్నారు. ప్రజలు సొంత భూమిలో ఇళ్లు నిర్మించుకుంటే అందుకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. టీఆర్ఎస్ కట్టిన ఒక డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కాంగ్రెస్ పార్టీ కట్టిన ఏడు ఇళ్లకు సమానమని కేసీఆర్ తెలిపారు.  

ఎస్సీ ఎస్టీలకు సబ్ ప్లాన్ తోపాటు అదనంగా మరిన్ని ఆర్థిక వనరులు సమకూర్చనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఎస్సీలకు ఏడాదికి రూ.15వేల కోట్లతో అభివృద్ధి పథకాలు అమలు చేస్తామని తెలిపారు. అలాగే రూ.6 నుంచి 10వేల కోట్లు గిరిజనుల అభివృద్ధికి కేటాయిస్తామని తెలిపారు. పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటించే సమయానికి పూర్తిస్థాయి పథకాలను విడుదల చేస్తామని తెలిపారు. 

అగ్రకులంలో పేదరికంలో మగ్గుతున్న రెడ్డి సామాజిక వర్గం, ఆర్య వైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హమీ ఇచ్చారు. చరిత్రలో కనివినీ ఎరుగని విధంగా సగం కడుపుతో తిని ఉన్న ఉద్యోగులను ఆదుకున్నామని తెలిపారు. హోంగార్డులు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకున్నాం. ట్రాఫిక్ పోలీసులకు 30శాతం యాక్సిడెంట్ బెనిఫిట్స్ కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. 

గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం నిబద్ధతో వృద్ధి రేటు17.07శాతం పెరిగిందని తెలిపారు. 2018-19 నుంచి రాష్ట్రానికి స్వయంగా సమకూరే ఆదాయం 19.73 శాతం ఉందని తెలిపారు. చిరు ఉద్యోగులు తమను ఆదరించాలని ఆదరిస్తే కచ్చితంగా పర్మినెంట్ చేస్తామని తెలిపారు. సముచిత రీతిలో ఉద్యోగులకు మధ్యంతర భృతి తప్పక ఇస్తామని తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ధైర్యంగా ఉండాలని టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

పరిపాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని కేసీఆర్ స్పష్టం చేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీ 24 గంటల విద్యుత్ అన్నారు ఇవ్వలేదని, మనిషికి 6కేజీల బియ్యం ఇస్తామని ఇవ్వలేదన్నారు.  పింఛన్ రూ.225 చెల్లిస్తామని కేవలం రూ.200 ఇచ్చారని కానీ చెయ్యలేదన్నారు. గ్యాస్ ధరలను50శాతం తగ్గిస్తామని చెప్పి 100శాతం పెంచారని ఆరోపించారు.

నాలుగు నెలల్లో నిరుద్యోగ భృతి అమలు చేస్తామని తెలిపారు. గైడ్ లైన్స్ రూపొందించిన నాలుగు నెలల్లో నిరుద్యోగ భృతి చెల్లిస్తామని తెలిపారు. ఇప్పటికే సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా నిరుద్యోగుల గురించి కాస్త అవగాహన వచ్చిందని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రతీ సంవత్సరం నిరుద్యోగుల సంఖ్యలో తేడా ఉంటుందని ఎన్నికల అనంతరం గైడ్ లైన్స్ రూపొందించి అర్హులందరికీ నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చారు.   ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందిస్తామని ఎక్కడా దళారీ వ్యవస్థకు తావు లేకుండా పథకాలు అందిస్తామని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios