30 రోజుల ప్రత్యేక కార్యాచరణతో పల్లెప్రగతి విజయవంతమైందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. గురువారం ప్రగతిభవన్‌లో ఆయన జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పంచడమే లక్ష్యంగా చేశామన్నారు. పవర్‌వీక్ పేరుతో విద్యుత్ సమస్యలు పరిష్కరించామని సీఎం గుర్తు చేశారు.

ఇదే స్ఫూర్తిని ఉద్యోగులు, అధికారులు కొనసాగించాలని..గ్రామాల అభివృద్ధికి నెలకు రూ.339 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కాగా.. 30 రోజుల ప్రణాళిక తొలి విడత పూర్తికావడంతో ప్రభుత్వం సూచించిన అంశాలపై తొలి విడతలో గ్రామాల వారీగా సిద్ధం చేసిన నివేదికలను అధికారులు ముఖ్యమంత్రికి అందజేశారు.

ఈ నివేదిక ఆధారంగా గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. రెండో విడత కార్యాచరణ ఎప్పుడు మొదలుపెట్టాలన్నది కలెక్టర్ల సమావేశంలోనే సీఎం కేసీఆర్ నిర్ణయించే అవకాశముందని తెలుస్తోంది.