రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమంపై గురువారం ప్రగతి భవన్‌లో కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.

అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రాణికోటికి, పర్యావరణానికి ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. దీనికి అవసరమైన విధివిధానాలు ఖరారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

పారిశుద్ధ్యం నిర్వహణలో కేంద్రం నుంచి అవార్డులు అందుకున్న పలువురు జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి అభినందించారు. ఇదే సమయంలో ప్రతి కలెక్టర్‌కు రూ.2 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, గ్రామాల్లో పారిశుద్ధ్యం, మొక్కల పెంపకానికి నిధులు ఉపయోగించాలని సీఎం సూచించారు.

గ్రామాలకు ఎట్టి పరిస్ధితుల్లోనూ నిధుల కొరత రానివ్వమని, 1.063 ఎకరాల్లో మంకీ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. ఎస్టీ ప్రాంతాల్లో త్రీఫేజ్ కరెంట్ కోసం త్వరలోనే కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.

మరోవైపు పల్లె ప్రగతి అమలు కొరకు ప్రభుత్వం రూ.64 కోట్లను విడుదల చేసింది.  జిల్లాకు రూ.2 కోట్లు చొప్పున నిధులను కేటాయించింది.