హైదరాబాద్: వ్యవసాయం, కరోనా నియంత్రణ తదితర అంశాలపై చర్చించేందుకు గాను జిల్లా కలెక్టర్లలతో సీఎం కేసీఆర్ మంగళవారం నాడు సమావేశమయ్యారు.

 ఈ సమావేశంలో మంత్రులు, పంచాయితీరాజ్ శాఖకు చెందిన అధికారులు కూడ పాల్గొన్నారు.రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే విషయమై కలెక్టర్లకు సీఎం దిశానిర్ధేశం చేయనున్నారు.

ఉపాధి హామీ నిధులతో వీలైనన్ని ఎక్కువ శాఖల్లో పనులు చేపట్టేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో నియంత్రిత సాగు పద్దతిలో పంటలు వేసుకోవాలని సీఎం కేసీఆర్ రైతులను కోరారు. నియంత్రిత సాగు పద్దతిలో పంటలు వేసుకొన్న రైతాంగానికి రైతు బంధు పథకం వర్తింపజేయనున్నట్టుగా ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది.

రైతు బంధు పథకం కింద రైతులకు నిధులను అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.రైతాంగానికి త్వరలోనే శుభవార్త చెబుతానని కేసీఆర్ ప్రకటించారు. 

రైతులకు పెట్టుబడి నిధులతో పాటు ఎరువులు, పురుగుల మందులు వంటివి ఉచితంగానే ఇచ్చే యోచనలో కూడ ప్రభుత్వం ఉంది.  ఈ విషయంపై కూడ ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.