తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు మీడియాతో మాట్లాడనున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు మీడియాతో మాట్లాడనున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు మీడియాకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందింది. అయితే గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న కేసీఆర్.. పోరుకు సిద్దమనే సంకేతాలు పంపుతున్నారు. ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్లు, బహిరంగ సభలలో కేంద్రాన్ని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. దేశాన్ని బీజేపీ సర్వనాశనం చేసిందని.. కేంద్రంపై అందరం కలిసి పోరాటం చేయాలని అంటున్నారు. అంతేకాకుండా కేంద్రంపై పోరుకు ఇతర పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. 

ఈ క్రమంలోనే పలువురు నేతలతో సీఎం కేసీఆర్.. సమావేశాలు నిర్వహించి చర్చలు జరిపారు. కేంద్రంపై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు. అయితే నేటి ప్రెస్ మీట్‌లో కూడా సీఎం కేసీఆర్ కేంద్రంపై విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా తెలంగాణకు చెందిన అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. 
ఈ నెల 17న విభజన సమస్యలపై కేంద్ర హోం శాఖ సమావేశంపై, తెలంగాణపై ప్రధాని చేసిన వ్యాఖ్యలపై స్పందించే అవకాశం కూడా ఉంది. ఇక, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma)ను బర్తరఫ్ చేయాలని కేసీఆర్ శనివారం యాదాద్రి భువనగరి జిల్లా జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. 

ఇక, ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సీఎం కేసీఆర్ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో రాష్ట్రపతి దంపతులు ముచ్చింతల్‌లో చిన్నజీయర్ స్వామి ఆలయానికి వెళ్లారు. ఇక, రాష్ట్రపతికి స్వాగతం అనంతరం కేసీఆర్.. తిరిగి ప్రగతి భవన్‌కు చేరుకున్నారు.