Asianet News TeluguAsianet News Telugu

ప్రగతి భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

దేశవ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రగతి భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 

CM KCR Hoists National Flag At Pragathi Bhavan on 73rd Republic Day
Author
Hyderabad, First Published Jan 26, 2022, 11:27 AM IST


దేశవ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించారు. సీఎం కేసీఆర్ (CM KCR) ప్రగతి భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ వేడుకల్లో తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎంవో అధికారులు, పలువురు  ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

అంతకు ముందు.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్.. సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ త్రివిధ దళాల అధికారులు.. స్వాగతం పలికారు. అనంతరం అక్కడి అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచిన కేసీఆర్.. యుద్దవీరులకు వందనం చేశారు. 

ఇక, తెలంగాణ వ్యాప్తంగా 73వ గణంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక, తెలంగాణ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, బీఆర్‌కే భవన్‌లో సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ కార్యాలయంలో డీజీపీ మహేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు.

శాసన మండలి ఆవరణలో ప్రొటెం చైర్మన్ హసన్ జాఫ్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఇక, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఎస్పీలు జాతీయ జెండాను ఎగరవేశారు.

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గణతంత్ర దినోత్సవ శుభకాంక్షలు..
73వ గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం వివిధ సభలకు తమ ప్రతినిధులను ఎన్నుకోవడం వల్ల దేశంలో పౌరులే పాలకులని సీఎం కేసీఆర్ అన్నారు.  భారతదేశం రాష్ట్రాల యూనియన్ అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్బావం నుంచి సమాఖ్య స్పూర్తిని ప్రదర్శిస్తోందని చెప్పారు. సమాఖ్య స్పూర్తిని మరింత దృఢంగా కొనసాగిస్తామని తెలిపారు.రాజ్యాంగ స్పూర్తిని కొనసాగించేందుకు ప్రతినబూనుదాం అన్నారు.

భారతదేశం రాష్ట్రాల యూనియన్ అని.. దేశాన్ని తయారు చేసేది రాష్ట్రాలేనని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రాల హక్కులను పరిరక్షించడం ద్వారా.. భారతదేశం యొక్క శక్తివంతమైన ప్రజాస్వామ్యం ప్రపంచానికి రోల్ మోడల్‌గా మారుతుందని సీఎం చెప్పారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సమాఖ్య స్ఫూర్తికి తమను తాము పునరంకితం చేసుకోవాలని.. అంకితభావంతో, నిబద్ధతతో దాని విలువలను కొనసాగించాలని భారత పౌరులను కేసీఆర్ కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios