తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ములుగు, నారాయణ పేటలను జిల్లాలుగా ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్. 533, 534 జారీ చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది.

భూపాలపల్లి జిల్లాను విభజించి ములుగు, మహబూబ్‌నగర్ జిల్లాను విడదీసి నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని కోసం వెంటనే ప్రాథమిక ప్రకటన జారీ చేయాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ.. భూపాల్‌పల్లి జయశంకర్, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.

ప్రజల నుంచి 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించి.. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే జిల్లాల సంఖ్య 33కు చేరనుంది. ములుగు జిల్లాలో ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాలతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది.

దామరగిద్ద, ధన్వాడ, కోస్గి, కృష్ణ, మద్దూరు, మాగనూరు, మక్తల్, మరికల్, నారాయణపపేట, నర్వ, ఊట్కూరుతో పాటు కోయిల్‌కొండను కూడా కలిపి మొత్తం 12 మండలాలతో నారాయణ పేట జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు.

రెండు కొత్త జిల్లాలతో పాటు నాలుగు కొత్త మండలాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లాలో చండూరు, మోస్రా, మేడ్చల్ జిల్లాలో మూడు చింతలపల్లి, సిద్ధిపేట జిల్లాలో నారాయణరావు పేట మండలాలు, జనగామ జిల్లా నుంచి గుండాల మండలాన్ని విడదీసి యాదాద్రి భువనగిరి జిల్లాలో కలిపేందుకు మరో జీవోను జారీ చేసింది.