తెలంగాణలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. టీడీపీ ఆధ్వర్యంలో మణుగూరు పట్టణంలో కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు.

అనంతరం టీడీపీ నేతలు మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌కు రాజకీయ భవిష్యత్‌ను ఇచ్చిన టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుపై  విచక్షణ కోల్పోయి అధికారముందన్న అహంకారంతో ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడం సరికాదన్నారు.

ఓట్ల కోసం రైతుబంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. తాను అక్రమంగా సంపాదించిన సొమ్మును ఎన్నికల్లో ఖర్చుచేసి రెండోసారి గెలుపొందిన కేసీఆర్‌.. చంద్రబాబుపై చేస్తున్న వాఖ్యలను, పాలన విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 

భగవంతుడు ఖచ్చితంగా కేసీఆర్‌కు తగిన శాస్తి చేస్తాడన్నారు. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా రాష్ట్రల పర్యటన చేసి వచ్చిన ఆయనకు ఆయా రాష్ట్రాలలో తగిన విధంగా స్పందన లభించకపోవడంవలనే చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. 

ఇప్పటికైనా ప్రజలకు మంచిచేసే పనులు చేపట్టి దురాహంకరపూరితంగా వ్యవహరించే విధానాన్ని విడనాడాలని హితవు పలికారు. కేసీఆర్‌ చేసే పనులన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, తప్పక ఆ ప్రజలే గుణపాఠం చెప్పేసమయం వస్తుందన్నారు.