రాష్ట్రంలో కనీసం 15 రోజుల పాటైనా లాక్‌డౌన్ పెట్టాలని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్:రాష్ట్రంలో కనీసం 15 రోజుల పాటైనా లాక్‌డౌన్ పెట్టాలని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసిందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.
సీఎం కేసీఆర్ రాజకీయ క్రీడలు పక్కన పెట్టి ముందు ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. తెలంగాణలో కనీసం 15 రోజులైనా లాక్‌డౌన్ పెట్టాలని ఆయన సూచించారు. కరోనా ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన కోరారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. హోటల్స్ స్వాధీనం చేసుకుని క్వారంటైన్ సెంటర్లుగా మార్చాలని ఆయన సూచించారు. ప్రతి పీహెచ్‌సీలో 30 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలో కరోనా కేసులపై మంత్రివర్గం చర్చించనుంది. లాక్ డౌన్ విధించాలా లేదా ఇతర ప్రత్యామ్నాయాలపై మంత్రివర్గం చర్చించి ఇవాళ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పటికే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
