హైదరాబాద్: రాష్ట్రంలో పాలన పడకేసిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.  ప్రజల సమస్యలను పక్కన పెట్టి కేటీఆర్ సీఎం అవుతారని మంత్రులు ప్రకటనలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

గురువారం నాడు ఆయన హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మూడేళ్లుగా ప్రభుత్వం సంక్షేమ రంగాన్ని గాలికి వదిలేసిందన్నారు. 

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో కూడ అర్ధం కావడం లేదన్నారు. ప్రజా సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని చెప్పారు. మంత్రులు, ఉన్నతాధికారులు ఎక్కడ ఉంటారో కూడ తెలియడం లేదన్నారు.

ప్రజల బాధలను పట్టించుకోకుండా కేటీఆర్ సీఎం అవుతారనే చర్చను ముందుకు తెచ్చి ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.

అవినీతి పరులపై కేసులు పెడతామని హెచ్చరించే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటి వరకు ఎంతమందిపై కేసులు పెట్టారో చెప్పాలన్నారు.రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతి జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఎందుకు దర్యాప్తు జరిపించడం లేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.