Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ ! నీ అవినీతిని బయటపెడతాం, వదిలి పెట్టం: సీఎం కేసీఆర్ పై భట్టి విక్రమార్క

పొలిటికల్ ఉగ్రవాదిగా మారిన కేసీఆర్ తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ ఉండకూడదనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత ఐదేళ్లుగా తెలంగాణ నిధులను దుర్వినియోగం చేశారని, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులలో భారీగా అవినీతి చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. వాటన్నింటిని తాము బయటపెడతామే భయాందోళనతో అవినీతి సొమ్ముతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్నారు

clp leader mallu batti vikramarka fires on kcr
Author
Hyderabad, First Published Jun 8, 2019, 7:04 PM IST

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క. కేసీఆర్ పొలిటికల్ టెర్రరిస్ట్ అంటూ ధ్వజమెత్తారు. సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ ఇందిరాపార్క్ వద్ద 36 గంటలపాటు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహ దీక్షకు దిగారు. 

పొలిటికల్ ఉగ్రవాదిగా మారిన కేసీఆర్ తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ ఉండకూడదనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత ఐదేళ్లుగా తెలంగాణ నిధులను దుర్వినియోగం చేశారని, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులలో భారీగా అవినీతి చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. 

వాటన్నింటిని తాము బయటపెడతామే భయాందోళనతో అవినీతి సొమ్ముతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్నారు. అందువల్లే కేసీఆర్ ఒక ఉగ్రవాదిగా మారారంటూ నిప్పులు చెరిగారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది దేశానికి నష్టమేనని, అదే రీతిలో తెలంగాణలో జరుగుతున్న రాజకీయ ఉగ్రవాదం కూడా ప్రజాస్వామ్యానికి ప్రమాదమని స్పష్టం చేశారు. 

సీఎం కేసీఆర్‌ చేస్తున్న రాజకీయం ముమ్మాటికీ రాజకీయ ఉగ్రవాదమేనని విమర్శించారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా జరిగిన సీఎల్పీ విలీనం కేవలం కాంగ్రెస్‌కు సంబంధించిన సమస్య మాత్రమే కాదన్నారు. ప్రజాస్వామ్యం ఖూనీకి గురైతే నష్టపోయేది సామాన్య ప్రజానీకమేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 

తెలంగాణలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ జరిగిందని ఆరోపించారు.  ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడితే సమాజమే ప్రమాదంలో పడుతుందంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని సభాపతి రద్దు చేయాలని రాజ్యాంగంలోని ఉందని, ఈ మేరకు తాము లేఖ కూడా ఇచ్చామన్నారు. తాము లేఖ ఇచ్చిన వెంటనే వాళ్ల సభ్యత్వం రద్దు చేసి ఉంటే ఇప్పుడు సీఎల్పీ విలీనం జరిగి ఉండేది కాదన్నారు. 

పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ ను కలిసేందుకు వెళ్తే అందుబాటులో లేరని చెప్తారని ఆరోపించారు. పీసీసీ ప్రెసిడెంట్ ఫోన్ చేసినా సమాధానం చెప్పరని నిలదీశారు. 

కానీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మాత్రం అపాయింట్మెంట్ ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క ఆమరణ నిరాహార దీక్షకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వీహెచ్ తోపాటు పలువురు పార్టీ నేతలు మద్దతు ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios