ఎన్నికల ముందు హామీలివ్వడం ఎన్నికల తర్వాత వదిలేయడం మోడీకి అలవాటేనని ఆరోపించారు తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు

ఎన్నికల ముందు హామీలివ్వడం ఎన్నికల తర్వాత వదిలేయడం మోడీకి అలవాటేనని ఆరోపించారు తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. మోడీకి మాట తప్పడం వెన్నతో పెట్టిన విద్య అంటూ ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో తెలంగాణకు మళ్లీ నిరాశే ఎదురైందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు.

బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదని... విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై ఊసేలేదని ఆయన మండిపడ్డారు. కేంద్రం అన్యాయంపై టీఆర్ఎస్ ఎంపీలు స్పందించడం లేదని... ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని విక్రమార్క జోస్యం చెప్పారు.

తెలంగాణకు చెందిన బీజేపీ, టీఆర్ఎస్ ఎంపీలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఎంపీలు నిద్రపోతున్నారా..? గాడిదలు కాస్తున్నారా అంటూ భట్టి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read:జమిలీ ఎన్నికలతో.. దేశం రెండుగా చీలిపోతుంది.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

అంతకుముందు టీపీసీసీ చీఫ్ చీఫ్, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... 2013-14, 20- 21 లెక్కలను పోలుస్తున్నారని మండిపడ్డారు. 13-14లో దేశంలో రైతు ఆత్మహత్యలు ఎన్ని జరిగాయి.. 20-21లో ఎన్ని రెట్లు రైతు ఆత్మహత్యలు పెరిగాయో ఆ లెక్కలు కూడా ఆర్ధిక మంత్రి ఇస్తే బాగుండేదని టీపీసీసీ చీఫ్ ధ్వజమెత్తారు.

అలాగే అప్పట్లో ధాన్యం, గోధుమలు ఏ రేటుకు కొనేవాళ్లు, ఈ రోజు ఏ రేటుకి కొనేవాళ్లో చెబితే బాగుండేదని ఉత్తమ్ మండిపడ్డారు. ప్రొక్యూర్‌మెంట్ ధర కూడా ఎన్నో రెట్లు పెరిగిన తర్వాత కూడా ఇలా వ్యవహరించడం రైతులను తప్పుదోవ పట్టించడమేనని ఆయన వ్యాఖ్యానించారు.

2016లో వున్న రైతుల ఆదాయం.. 2022 నాటికి రెట్టింపు అవుతుందన్న మాట పచ్చి అబద్ధమని, ఈ దేశంలో ఏ రైతుకి కూడా ఆదాయం రెట్టింపు కాదు కదా..? కనీసం పెరగలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో మెట్రో విస్తరణ కోసం నిధులు కేటాయించిన కేంద్రం.. హైదరాబాద్‌ను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన నిలదీశారు.