సారాంశం
తెలంగాణ విశ్వవిద్యాలయంలో కుర్చీ పోరు సాగుతుంది. వర్సిటీ రిజిస్ట్రార్ నియామకంపై వివాదం రోజురోజుకు ముదురుతోంది. రిజిస్ట్రార్ పదవిపై ప్రొఫెసర్ యాదగిరి, ప్రొఫెసర్ కనకయ్యల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో కుర్చీ పోరు సాగుతుంది. వర్సిటీ రిజిస్ట్రార్ నియామకంపై వివాదం రోజురోజుకు ముదురుతోంది. రిజిస్ట్రార్ పదవిపై ప్రొఫెసర్ యాదగిరి, ప్రొఫెసర్ కనకయ్యల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రిజిస్ట్రార్‌ను నేనంటే.. నేను.. అంటూ వాదిస్తున్నారు. వైస్ చాన్సలర్.. కనకయ్యను రిజిస్ట్రార్‌గా నియమించగా పాలకమండలి అంగీకరించడం లేదు. మరోవైపు పాలకమండలి.. యాదగిరిని రిజిస్ట్రార్‌గా నియమించగా వైస్ చాన్సలర్ అంగీకరించడం లేదు. ఈ క్రమంలోనే వర్సిటీ ఉద్యోగులు రెండు వర్గాలుగా చిలీపోయారు. వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్ చాంబర్‌లకు తాళాలు వేశారు. వర్సిటీ రిజిస్ట్రర్ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని.. రిజిస్ట్రార్ ఎవరో తేల్చాలని వర్సిటీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
పాలకమండలి వర్సిటీ రిజిస్ట్రార్‌గా యాదగిరిని నియమించిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం ఉదయం 11 గంటలకు యాదగిరి రిజిస్ట్రార్ ఛాంబర్‌కు వచ్చి కుర్చీలో కూర్చున్నారు. ఆ తర్వాత కొంతసేపటికే వైస్ చాన్సలర్ నియమించిన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కనకయ్య కూడా కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రార్‌గా ఆర్డర్ కాపీ చూపించాలని.. ఉత్తర్వులు లేకుండా రిజిస్ట్రార్ సీటులో ఎలా కూర్చుంటారని యాదగిరిని కనకయ్య ప్రశ్నించారు. తనను పాలకమండలి నియమించిందని.. రిజిస్ట్రార్‌ను నియమించే అధికారం పాలకమండలికే ఉంటుందని యాదగిరి బదులిచ్చారు. ప్రత్యేకంగా ఆర్డరు కాపీ అవసరం లేదని అన్నారు. అయితే కనకయ్య మాత్రం ఆ సమాధానంతో సంతృప్తి చెందలేదు.
తనను రిజిస్ట్రార్‌గా నియమిస్తూ వైస్ చాన్సలర్ ఇచ్చిన ఉత్తర్వు కాపీని కనకయ్య చూపించారు. ఆర్డర్ కాపీ లేనందున కుర్చీలో కూర్చోవడం సరికాదంటూ యాదగిరితో అన్నారు. ఆర్డర్ కాపీ ఉన్నందున తానే పదవిని నిర్వహిస్తానని స్పష్టం చేశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వర్సిటీ అధ్యాపకులు, ఉద్యోగులు ఇరువురికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఈ విషయంలో విద్యార్థి సంఘాలు కూడా రెండు వర్గాలుగా వీడిపోయి.. ఇద్దరు రిజిస్ట్రార్లకు అనుకూలంగా నినాదాలు చేశాయి. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చేవరకు.. రిజిస్ట్రార్, వీసీ కార్యాలయాలకు తాళం వేసి వర్సిటీ పాలనను స్తంభింపజేయాలని విద్యార్థి సంఘాల నాయకులు సూచించారు. చివరకు వర్సిటీ సిబ్బంది.. రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం వేశారు.