టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి క్లారిటీ వచ్చింది. శనివారం జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్రపై స్పష్టత వచ్చింది. 50 నియోజకవర్గాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి , 30 నియోజకవర్గాల్లో సీనియర్లు జోడో యాత్ర చేయనున్నారు. ఇదిలావుండగా.. రేవంత్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి తీవ్రవ్యాఖ్యలు చేశారు మహేశ్వర్ రెడ్డి. రేవంత్ పాదయాత్రకు అధిష్టానం అనుమతి ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. హత్ సే హత్ జోడోలో బ్లాకుల వారీగా పాదయాత్ర నిర్వహిస్తామని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అభియాన్ ముగింపులో భాగంగా హైదరాబాద్‌లో జరిగే సభకు రాహుల్ గాంధీ వస్తారని ఆయన తెలిపారు. ఏఐసీసీ ఇచ్చిన సర్క్యూలర్‌లో 2 నెలల పాదయాత్ర అని వుందని.. కానీ జనవరి 26 నుంచి 5 నెలల పాటు పాదయాత్ర అన్నారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని ఏఐసీసీ వెల్లడించిందన్నారు. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
ALso REad: రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ షాక్.. పాదయాత్రకు నో పర్మిషన్
కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా యాత్ర పేరుతో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం ఆయన విడుదల చేశారు. జనవరి 26 నుంచి జూన్ 2 వరకు రేవంత్ పాదయాత్ర చేయనున్నారు. ‘‘హాత్ సే హాత్ జోడ్ అభియాన్’’ పేరుతో ఆయన యాత్ర నిర్వహించనున్నారు. ఇటీవల ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వేడి చల్లారకుండా.. ఆ యాత్రకు కొనసాగింపుగా కొన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లు ఈ యాత్ర చేపట్టాలని ఏఐసీసీ ఇప్పటికే ఆదేశించింది. ఈ క్రమంలో మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి
