Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు, ఎప్పటినుంచంటే.....

జూన్ 1వ తేదీ నుండి 5వ దఫా లాక్ డౌన్ మొదలవనున్న నేపథ్యంలో హైదరాబాద్ లో సిటీ బస్సులను తిరిగి ప్రారంభించాలన్న డిమాండ్ ఎక్కువవుతుంది. హైదరాబాద్ మొత్తంలో పరిశ్రమలు, ఆఫీసులు తెరుచుకున్న నేపథ్యంలో ఉద్యోగులు అక్కడికి చేరుకోవడానికి ప్రజా రవాణా వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. 

City Buses To Start Operation In Hyderabad
Author
Hyderabad, First Published May 30, 2020, 2:05 PM IST

నాలుగవ దఫా విధించిన లాక్ డౌన్ ఈ నెల 31వ తేదీతో ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ నాలుగవదఫా లాక్ డౌన్ లో తెలంగాణ ప్రజలకు చాలా సడలింపులనే ఇచ్చింది కేసీఆర్ సర్కార్. 

జూన్ 1వ తేదీ నుండి 5వ దఫా లాక్ డౌన్ మొదలవనున్న నేపథ్యంలో హైదరాబాద్ లో సిటీ బస్సులను తిరిగి ప్రారంభించాలన్న డిమాండ్ ఎక్కువవుతుంది. హైదరాబాద్ మొత్తంలో పరిశ్రమలు, ఆఫీసులు తెరుచుకున్న నేపథ్యంలో ఉద్యోగులు అక్కడికి చేరుకోవడానికి ప్రజా రవాణా వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. 

ఇప్పటికే ఆర్టీసీ బస్సులను జిల్లాల్లో ప్రారంభించిన నేపథ్యంలో వాటిలాగానే నిబంధనలను పెట్టి సిటీ బస్సులను ప్రారంభించే యోచనలో సర్కార్ ఉన్నట్టు తెలియవస్తుంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు జూన్ మొదటి వారంలో బస్సులు రోడ్లెక్కే ఆస్కారం ఉన్నట్టుగా తెలియవస్తుంది. 

కాకపోతే కేసులు అధికంగా నమోదవుతూ ఉండడం, జంట నగరాల పరిధిలోనే కరోనా వ్యాప్తి అధికంగా ఉండడం, రానున్న లాక్ డౌన్ 5 లో హైదరాబాద్ పై ఎక్కువ ఫోకస్ పెట్టనున్న నేపథ్యంలో సిటీ బస్సులపై ఒకింత అనిశ్చితి కూడా నెలకొంది. ఏది ఏమైనా సిటీ బస్సులను మాత్రం ప్రారంభించాలని ప్రభుత్వ వర్గాలతోపాటు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. 

ఇకపోతే.... తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన నెల రోజుల వ్యవధిలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులోనే 169 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలుపుకుని తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 2,425కు చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 82 మందికి, రంగారెడ్డి జిల్లాలో 14, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున కరోనా పాజిటివ్‌గా తేలింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో 64 మందితో పాటు మరో ఐదుగురు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులకు వైరస్ సోకింది.

శుక్రవారం కోవిడ్ 19తో నలుగురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 71కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 1,381 మంది డిశ్చార్జ్ అయ్యారు. 973 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

కరోనా వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి చెందిందా అనే విషయమై జీహెచ్ఎంసీ పరిధిలో ఐసీఎంఆర్ సర్వే నిర్వహించనుంది. దేశంలో ఎంపిక చేసిన కొన్ని పట్టణాల్లో ఐసీఎంఆర్ సర్వే నిర్వహించనుంది. నగరంలోని ఐదు కంటైన్మెంట్ జోన్లలో రెండు రోజుల పాటు ఈ సర్వే నిర్వహించనున్నారు. 

నగరంలోని ఆదిభట్ల, బాలాపూర్, మియాపూర్, చందానగర్, టప్పాచబుత్రా ప్రాంతాల్లో సర్వేలైన్స్ సర్వే నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన ఐదు ప్రాంతాల్లో 10 ప్రత్యేక టీమ్ ల ద్వారా సర్వేకు ఏర్పాట్లు చేశారు

ఈ ఐదు కంటైన్మెంట్ జోన్లలో కరోనా కేసులు, వాటి పరిస్థితి, లక్షణాలపై ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. సర్వే ద్వారా హైద్రాబాద్ లో పెరుగుతున్న కరోనా కేసులపై ఐసీఎంఆర్ నివేదికను అందించనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios