ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారిని మోసం చేసిన ఓ అపరిచితుడు రూ.1.94 లక్షల డబ్బులు తీసుకుని పారిపోయాడు. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌లోని ముసారాంబాగ్ డివిజ్ శాలివాహననగర్‌కు చెందిన నియమతుల్లా ఖాన్ అనే వ్యక్తి స్థానిక కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు.

పనిచేసే ప్రాంతంలో ఓ గృహ నిర్మాణం కోసం ఇసుక తీసుకువచ్చేందుకు సుమారు రూ.2 లక్షల నగదును ఇంట్లో దాచి వుంచాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఎల్‌బీ నగర్‌లోని ఆటోనగర్‌కు వెళ్తూ డబ్బును బీరువాలో ఉంచి... అందులోంచి ఖర్చుల కోసం రూ.6 వేలు తీసుకున్నాడు.

ఇంట్లోనే భార్యాపిల్లలు ఉండటంతో బీరువాకి తాళం వేయకుండా వెళ్లిపోయాడు నియమతుల్లాఖాన్. ఇదే సమయంలో అతని భార్య సమీరా.. మధ్యాహ్నం వేళ తన తల్లి వద్దకు వెళ్లింది. ఇంట్లో ఐదేళ్ల కుమారుడు మహీర్ అహ్మద్ ఖాన్, నియమతుల్లాఖాన్ అన్న కుమారుడు ఆరేళ్ల ముస్తాఫా.. ఇద్దరూ ఆడుకుంటున్నారు.

ఇంట్లో పిల్లలు మాత్రమే ఉండటాన్ని గమనించిన ఓ అపరిచిత వ్యక్తి అక్కడికి వచ్చి.. తలుపుకొట్టాడు. తలుపుకొట్టగానే మహీర్ తలుపు తీశాడు. ‘‘ బాగా ఆకలేస్తోంది.. ఇంట్లో ఎవరూ లేరా బాబు అని అడగాడు.. ఎవరు లేరని నిర్ధారణ కావడంతో ఇంట్లో డబ్బులున్నాయా’’ అని అడిగాడు.

అతని మాటలు నమ్మిన మహీర్ తన తండ్రి బీరువాలో దాచిన రూ. 1,94,000లను తీసుకొచ్చి.. అతని చేతిలో ఉంచాడు.. అంతే డబ్బులను జేబులో వేసుకుని ఆ అపరిచిత వ్యక్తి అక్కడి నుంచి దుకాణం సర్దేశాడు.

సాయంత్రం ఇంటికి వచ్చిన నియమతుల్లా ఖాన్.. బీరువాలో పెట్టిన డబ్బులు కనిపించకపోవడంతో భార్యాపిల్లలను ప్రశ్నించగా.. అతని కొడుకు అసలు విషయం చెప్పడంతో ఆవేదనతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.