ఆర్ధిక లావాదేవీలపై ఆరా:ఏడు గంటలపాటు చీకోటి ప్రవీణ్ విచారణ
ఏడు గంటల పాటు చీకోటి ప్రవీణ్ కుమార్ విచారణ జరిగింది. ఇవాళ ఈడీ విచారణకు చీకోటి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు.
హైదరాబాద్: చీకోటి ప్రవీణ్ కుమార్ ఈడీ విచారణ ముగిసింది. ఈడీ అధికారులు ఏడు గంటల పాటు చీకోటి ప్రవీణ్ కుమార్ ను విచారించారు. సోమవారంనాడు చీకోటి ప్రవీణ్ కుమార్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ విచారణకు హాజరు కావాలని గత వారంలో చీకోటి ప్రవీణ్ కుమార్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ నెల 1వ తేదీన థాయ్ లాండ్ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ చీకోటి ప్రవీణ్ కుమార్ అక్కడి పోలీసులకు చిక్కాడు. ఈ కేసు నేపథ్యంలోనే ఈడీ అధికారులు చీకోటి ప్రవీణ్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు. చీకోటి ప్రవీణ్ కుమార్ సహా మరో ఇద్దరికి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
also read:ఈ నెల 15న విచారణకు రావాలి:చీకోటి ప్రవీణ్‌కు మరోసారి ఈడీ నోటీసులు
గతంలో కూడా చీకోటి ప్రవీణ్ కుమార్ ను ఈడీ అధికారులు విచారించారు. ఈ ఏడాది ఏప్రిల్ 16 నుండి 21 వరకు థాయ్ లాండ్ లో చీకోటి ప్రవీణ్ కుమార్ గ్యాంబ్లింగ్ నిర్వహించారు. ఏప్రిల్ 27 నుండి మే 1వ తేదీ వరకు రెండో దఫా గ్యాంబ్లింగ్ నిర్వహించే సమయంలో థాయ్ లాండ్ పోలీసులు చీకోటి ప్రవీణ్ కుమార్ సహా 83 మందిని అరెస్ట్ చేశారు.ఈ కేసులో చీకోటి ప్రవీణ్ కుమార్ సహా పలువురికి బెయిల్ మంజూరైంది. థాయ్ లాండ్ లో గ్యాంబ్లింగ్ విషయమై ఆర్ధిక లావాదేవీలపై ఈడీ అధికారులు చీకోటి ప్రవీణ్ కుమర్ ను ఇవాళ విచారించారని సమాచారం.
థాయ్ లాండ్ లో గ్యాంబ్లింగ్ పై నిషేధం ఉన్న విషయం తనకు తెలియదని చీకోటి ప్రవీణ్ కుమార్ గతంలో మీడియాతో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. థాయ్ లాండ్ లో గ్యాంబ్లింగ్ విషయంతో తనకు సంబంధం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఇవాళ ఈడీ విచారణ ముగిసిన తర్వాత చీకోటి ప్రవీణ్ కుమార్ ఓ తెలుగు న్యూస్ చానెల్ తో మాట్లాడారు. థాయ్ లాండ్ లో తాను ప్లేయర్ గా వెళ్లినట్టుగా చెప్పారు. ఆర్గనైజర్ గా తాను థాయ్ లాండ్ కు వెళ్లలేదన్నారు. థాయ్ లాండ్ లో గ్యాంబ్లింగ్ నిర్వహించినవారంతా జైల్లోనే ఉన్నారన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనన్నారు. ఇప్పట్లో క్యాసినో నిర్వహించే ఆలోచన లేదన్నారు. ఈడీ విచారణకు ఎప్పుడూ పిలిచినా వెళ్తానని ఆయన స్పష్టం చేశారు.