బీజేపీలో చేరేందుకు వెళ్లిన చికోటీ ప్రవీణ్‌కు చేదు అనుభవం.. తనంటే భయం ఏంటో అర్థమైందని కామెంట్స్..
బీజేపీలో చేరేందుకు చూసిన క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ పరిణామాలపై చీకోటి ప్రవీణ్ అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీలో చేరేందుకు చూసిన క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ముందుగా నిర్ణయించిన విధంగా చికోటి ప్రవీణ్ మంగళవారం బీజేపీలో చేరాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఇందుకోసం చీకోటి ప్రవీణ్ భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన తన అనుచరులతో కలిసి సంతోష్ నగర్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బయలుదేరారు. అయితే చీకోటి రాకకముందే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. దీంతో చీకోటి ప్రవీణ్ నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.
అయితే ఈ పరిణామాలపై చీకోటి ప్రవీణ్ అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలాఉంటే, ఈ పరిమాణాలపై చీకోటి ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ.. తనకు, తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలకు మధ్య కొంత పొరపాటు జరిగిందని అన్నారు. ‘‘ఏదో కార్యక్రమంలో బిజీగా ఉన్నందున నాయకులు ఎవరూ ఆఫీసులో లేరని నాకు చెప్పారు. దీనిపై జాతీయ స్థాయి నేతలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాను. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది’’ అని చీకోటి ప్రవీణ్ పేర్కొన్నారు.
అయితే తాజాగా చీకోటి ప్రవీణ్ ఒక వీడియో విడుదల చేశారు. అందులో.. ఈ పరిణామాలతో తాను నిరుత్సాహపడలేదని.. తమ బలం ఇంకా పెరిగిందని చీకోటి ప్రవీణ్ అన్నారు. స్వచ్ఛదంగా వేల సంఖ్యలో అభిమానులు తన కోసం వచ్చారని.. తెలంగాణ నుంచే కాకుండా, ఏపీ నుంచి వచ్చారని.. వారందరికి తనపై ఉన్న ప్రేమ తెలిసిందని చెప్పారు. అయితే జరిగిన సంఘటన దురదృష్టకరమని.. అయితే తామంటే ఏంటో కూడా అర్థమైందని అన్నారు. తనంటే భయం ఏంటో అర్థమైందని, ఏ శక్తులు తనని ఏమీ చేయలేవని అన్నారు. ‘కుళ్లు రాజకీయాలు చేస్తున్న వాళ్లకు సవాల్ విసురుతున్నా. మీలా వెన్నుపోటు రాజకీయాలు నాకు రావు. మీ రాజకీయం మీరు చేయండి.. నా రాజకీయం నేను చేస్తా’ అని చీకోటి ప్రవీణ్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, చీకోటి ప్రవీణ్‌ను పార్టీలో చేర్చుకునేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆసక్తిగా లేరనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మాత్రం చీకోటి ప్రవీణ్‌ను పార్టీలోకి తీసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని తెలుస్తుంది. బీజేపీలో చేరిన తర్వాత ఎల్‌బీ నగర్ నుంచి పోటీ చేయాలని ప్రవీణ్ భావిస్తున్నట్టుగా సమాచారం.