హైదరాబాద్: తెలంగాణ శానససభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరోక్షంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి మద్దతు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుమానిస్తున్నారు. దీంతో ఆయన దానికి విరుగుడుగా వ్యూహాన్ని రచించి అమలు చేయడానికి సిద్ధపడ్డారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొట్టడానికి చంద్రబాబు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ నేతలను పంపిస్తున్నారు. సీమాంధ్ర ఓటర్లను తమ వైపు తిప్పికోవడానికి తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ నేతలు ఇప్పటికే తెలంగాణలో తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు. కూకట్ పల్లిలో మంత్రి పరిటాల సునీత రోడ్ షో నిర్వహించడం ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. 

తెలంగాణ ఎన్నికలకు వైసీపీ, జనసేన పోటీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సీమాంధ్ర ఓటర్లను టిఆర్ఎస్ కు అనుకూలంగా మార్చడానికి వైసీపీ, జనసేన నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నాలను వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కొంత వరకు బహిరరంగంగానే చేస్తోంది. 
కూకట్‌పల్లిలో సుహాసిని ఓటమికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు రంగంలోకి దిగారు. వారు సమావేశమై టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సీమాంధ్ర సెటిలర్స్‌ ఫోరం పేరుతో గ్రేటర్‌ హైదరాబాదులో వైసీపీ ఆధ్వర్యంలో ఒక సభ జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమావేశానికి మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. కడప జిల్లాకు చెందిన కొందరు వైసీపీ నేతలు చొరవ తీసుకొని ఈ సభను నిర్వహించారని చెబుతున్నారు.
 
జనసేన నేతలు ఇంత బహిరంగంగా సభలు, సమావేశాలు పెట్టడం లేదు. కానీ లోలోపల కారు కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కూకట్ పల్లి, శేర్ లింగంపల్లి తదితర ప్రాంతాల్లో కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా కూకట్ పల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు ఓటేయాలని వారు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు  ఖమ్మంజిల్లా సత్తుపల్లిలో సైతం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు టీఆర్‌ఎస్‌ కోసం పనిచేస్తున్నారని అంటున్నారు. తెలంగాణ 
 
ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య నేతలను చంద్రబాబు తెలంగాణ ప్రచారంలో వాడుకుంటున్నారు. వాస్తవానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలను తెలంగాణలో ప్రచారానికి పంపరాదని టీడీపీ నాయకత్వం మొదటి భావించింది. వైసీపీ, జనసేన ప్రయత్నాల నేపథ్యంలో వ్యూహం మార్చుకున్నట్లు చెబుతున్నారు. 
వైసిపి, జనసేన పార్టీల ప్రభావం ఉందని అనుకుంటున్న చోట్లకు ఏపీకి చెందిన కొందరు నేతలను ప్రచారానికి పంపించింది. ఇందులో భాగంగానే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, గంటా శ్రీనివాసరావు కూడా ప్రచారానికి వెళ్తారని చెబుతున్నారు.