ఇప్పటి వరకు చైన్ స్నాచింగ్ అంటే రోడ్డుపై వెళుతున్న మహిళల మెడలోని పుస్తెల తాడును తెంపుకుని వెళ్లడమే.. కానీ వరుస దొంగతనాలతో మహిళలు జాగ్రత్తపడుతుండటంతో దొంగల చూపు పురుషులపై పడింది.

మగవారి మెడలోని చైన్‌లను తెంచుకుని వెళ్ళాలని వారు భావించినట్లుగా తెలుస్తుంది. తాజాగా రాజేంద్రనగర్‌లో జరిగిన దొంగతనమే ఇందుకు నిదర్శనం. రాజేంద్రనగర్ న్యూఫ్రెండ్స్ కాలనీలో నివసించే రాఘవరెడ్డి కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు.

ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఎప్పటిలాగానే తన షాపులో కూర్చొని ఉన్నాడు. ఈ సమయంలో బైక్‌పై హెల్మెట్ ధరించి వచ్చిన ఓ యువకుడు సిగరెట్ కావాలని అడిగాడు. సిగరేట్ ఇచ్చేందుకు రాఘవరెడ్డి కిందకు వంగిన వెంటనే... దుండగుడు అతని మెడలోని మూడు తులాల బంగారు గొలుసును అపహరించుకుని ఉడాయించాడు.

రెప్పపాటులో జరిగిన ఈ సంఘటనతో రాఘవరెడ్డి షాక్‌కు గురయ్యాడు. వెంటనే షాక్ నుంచి తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.