హైదరాబాద్: సీట్ల పంపకం విషయంలో కాంగ్రెసు వ్యవహరిస్తున్న తీరుపై సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా కూటమి హిట్టయిందని, అయితే కాంగ్రెసు లీకుల వల్ల నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆయన గురువారం మీడియాతో అన్నారు. 

కూటమి ఏర్పాటులో తమదే ప్రథమ స్థానమని చెప్పుకున్నారు. తాము 9 సీట్ల నుంచి ఐదుకు దిగి వచ్చామని, దానికి కూడా కాంగ్రెసు సిద్ధంగా లేదని చాడ వెంకట రెడ్డి అన్నారు. మూడు ఎమ్మెల్యే సీట్లు, ఓ ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కాంగ్రెసు అంటోందని ఆయన చెప్పారు. తాము నాలుగు ఎమ్మెల్యే సీట్లు, ఓ ఎమ్మెల్సీ సీటు కావాలని అడుగుతున్నట్లు ఆయన తెలిపారు.

కాంగ్రెసు అభ్యర్థుల జాబితా ప్రకటన అధికారికంగా వెలువడిన తర్వాత తమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని ఆయన చెప్పారు. తాము రేపు (శుక్రవారం) అత్యవసరంగా సమావేశమవుతున్నట్లు తెలిపారు.  సిపిఐ బెల్లంపల్లి సీటుకు బదులు మంచిర్యాల సీటు అడుగుతున్నట్లు తెలుస్తోంది.