తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ అవుటర్ రింగ్ రోడ్డు ఓ మణిహారంలా నిలిచి ట్రాపిక్ కష్టాలను తీరుస్తున్న విషయం తెలిసిందే. అయితే దానికి ఆవల రీజనల్ రింగ్ రోడ్డు పేరుతో శివారు పట్టణాలను కలుపుతూ మరో బారీ ప్రాజెక్టును చేపట్టాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఫలించి హైదరాబాద్ చుట్టూ నాలుగు వరుసల రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం లభించింది.

ఈ రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదనను చాలా రోజుల క్రితమే తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా పనులను వేగవంతం చేశారు. భారీ నిధులతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతుల కోసం ఇటీవలే టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర రవాణ మంత్రి నితిన్ గడ్కరిని కలిసారు. రోజురోజుకూ విస్తరిస్తున్న హైదరాబాద్ నగర పరిస్థితిని వివరించి రీజనల్ రింగ్ రోడ్డు అవసరాన్ని ఎంపీలు మంత్రికి వివరించారు. అందువల్ల వెంటనే రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు అనుమతివ్వాలని గడ్కరిని కోరారు.  

మంత్రి ఆదేశాల మేరకు ఇవాళ ఎన్‌హెచ్‌ఏ ( నేషనల్ హైవే అథారిటీ) అధికారులు టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ విస్తరణ, అభివృద్ది కోసం రింటగ్ రోడ్డు ఆవసరాన్ని ఎంపీలు అధికారులకుమ వివరించారు. తాము తెలిపిన వివరాలతో సంతృప్తి చెందిన అధికారులు సూత్రప్రాయంగా అంగీకరించనట్లు ఎంపి కవిత తెలిపారు.  

ఈ అంశంపై ఎంపి కవిత ఈ  విధంగా ట్వీట్ చేశారు. '' ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక వంటి ప్రాజెక్ట్ ''రీజనల్ రింగ్ రోడ్డు'' త్వరలోనే నిజం కానుంది. హైదరాబాద్ శివారులోని జిల్లాలను కలుపుతూ ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది. ఇందుకోసం తెలంగాణ ఎంపీలు ఎన్‌హెచ్ఏ అధికారులతో పాటు ఇందుకు సంబంధించిన తెలంగాణ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం''  అన్నారు.