హైదరాబాద్‌ : ఎర్రమంజిల్ కూల్చివేత అంశంపై కేంద్ర పురావస్తు శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. నూతన అసెంబ్లీ భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎర్రమంజిల్ ను కూల్చివేయాలని నిర్ణయించింది. ఎర్రమంజిల్ కూల్చివేత అంశంపై పలువురు కేంద్ర పురావస్తు శాఖకు లేఖలు రాశారు. 

ఎర్రమంజిల్ కూల్చివేత ఘటనపై ఆరా తీసిన కేంద్ర పురావస్తు శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎర్ర మంజిల్‌ పై సమగ్ర నివేదికను సమర్పించాలని రాష్ట్ర పురావస్తు శాఖను ఆదేశించింది. ఎర్రమంజిల్ కూల్చివేతపై రాష్ట్రపురావస్తు శాఖ ఎందుకు మౌనంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చివేసి ఆ స్థానంలో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తామంటూ గత నెల 24న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అంతేకాదు భవన నిర్మాణానికి సంబంధించి గత నెల 27న భూమి పూజ కూడా చేశారు. 

అయితే కొత్త అసెంబ్లీ భవనాల నిర్మాణం, ఎర్రమంజిల్ కూల్చివేతపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలు రాజకీయ పార్టీలతోపాటు స్వచ్ఛంధ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. దాంతో ఈ వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది.  

ఓ చారిత్రక భవనం కూల్చివేతకు సంబంధించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే కీలక పాత్ర పోషించాల్సిన రాష్ట్ర పురావస్తు శాఖపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖకు పలువురు ఫిర్యాదులు చేశారు. 

ఫిర్యాదులను పరిశీలించిన కేంద్రం సాంస్కృతిక శాఖ రాష్ట్ర పురావస్తు శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎర్రమంజిల్ పై రాద్ధాంతం జరుగుతున్నా తమకు సంబంధం లేదన్నట్లుగా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ పురావస్తు శాఖ అధికారులకు అక్షింతలు వేసింది.  

ఇకనైనాప్రేక్షక పాత్రకు స్వస్తి పలికి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కేంద్ర ఆదేశాలతో రాష్ట్ర పురావస్తు శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఎర్ర మంజిల్‌ను సందర్శించి భవనం పటిష్ఠతపై వివరాలు సేకరించారు. 

ఇదే అంశంపై చారిత్రక భవనాల పరిరక్షణకు కృషిచేస్తున్న ఇన్‌ట్యాక్‌ సంస్థ ప్రతినిధులు కూడా ఎర్ర మంజిల్‌ను సందర్శించారు. భవనం పటిష్టతతో పాటు భవనం కూల్చివేయకుండా ప్రభుత్వం అవలంబించగలిగే ప్రత్యామ్నాయ మార్గాలు, అందుబాటులో ఉన్న స్థలం, పరిసరాలను పరిశీలించారు. 

అలాగే ఎర్ర మంజిల్‌ ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో అసెంబ్లీ భవనం ఇక్కడే నిర్మిస్తే ట్రాఫిక్‌ సమస్య తీవ్రమయ్యే ఛాన్స్ ఉందంటూ రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. 

మరోవైపు ఎర్రమంజిల్ పటిష్టత, ప్రత్యామ్నాయ మార్గాలు, ట్రాఫిక్ వంటి సమస్యలపై సీనియర్‌ ఆర్కిటెక్ట్‌లతో కూడిన ఇన్‌ట్యాక్‌ నిపుణుల కమిటీ పరిశీలించింది. ఇప్పటికే ఎర్రమంజిల్ పై కోర్టులో కేసు వేసిన ఇన్ ట్యాక్ పూర్తి అధ్యయనం చేసి నివేదికను హైకోర్టుకు సమర్పించాలని భావిస్తోంది.  

ఇకపోతే ఈ ఎర్రమంజిల్ భవనాన్ని 150 ఏళ్ల క్రితం నిజాం పాలకులు నిర్మించారు. నిజాం పాలనలో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన నవాబ్‌ ఫక్రుల్‌ ముల్క్‌ 1870లో ఈ భవనాన్ని నిర్మించారు. దీనికి ‘ఇరం మంజిల్‌’ అని పేరు పెట్టారు. కాలక్రమేణా ఇరం మంజిల్ కాస్త ఎర్రమంజిల్ గా మారిపోయింది.