హైదరాబాద్ జీఎస్టీ కమీషనరేట్ పరిధిలో అవినీతి అధికారులను సీబీఐ అరెస్ట్ చేసింది. కమీషనరేట్‌లోని పన్ను ఎగవేత నిరోధక విభాగంలో అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు.

ఇన్‌పుట్ క్రెడిట్‌ను మంజూరు చేసేందుకు పలు కంపెనీల డైరెక్టర్ల నుంచి వీరు రూ.5 కోట్ల లంచాన్ని డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది. సుధారాణి, బొల్లినేని శ్రీనివాస్ గాంధీ అనే ఇద్దరు ఉన్నతోద్యోగులపై సీబీఐ కేసు నమోదు చేసింది.

ఓ ప్రైవేట్ కంపెనీలో సీబీఐ దాడులు నిర్వహించడంతో ఈ అధికారుల అవినీతి వ్యవహారం బయటపడింది. సీబీఐ కేసు నమోదు చేసిన ఇద్దరిలో శ్రీనివాస గాంధీ అనే వ్యక్తి గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో (ఈడీ) కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

ఈ వ్యక్తిపై తాజాగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యవహారంలో సీబీఐ అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించినట్లు సమాచారం.