విజయవాడ: విజయవాడలో ఓ ఫైనాన్స్ వ్యాపారి దేవరపల్లి గగారిన్ అనే ఫైనాన్స్ వ్యాపారిపై ఇద్దరు  దుండగులు  పెట్రోల్ పోసి నిప్పంటించారు.   తీవ్రంగా కాలిన గాయాలతో  గగారిన్ ను  స్థానికులు  ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నారు.

విజయవాడ బీసెంట్‌ రోడ్డులోని మూన్‌మూన్ ప్లాజా వద్ద చిలుకూరి దుర్గయ్య వీధిలో  ఉన్న ఫైనాన్స్ కార్యాలయంలోనే గగారిన్ ‌పై  ఇద్దరు దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన ఫైనాన్స్ కార్యాలయం నుండి తగలబడుతూ బయటకు పరుగెత్తుకు వచ్చాడు.  ఆర్థికపరమైన అంశాల్లో విబేధాల కారణంగానే గగారిన్‌పై దాడికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

మద్దాల సుధాకర్, సురేష్ అనే ఇద్దరు వ్యక్తులతో గగారిన్ కు విబేధాలు ఉన్నట్టు  పోలీసులు చెబుతున్నారు.  వీరిద్దరే  ఈ దాడికి పాల్పడ్డారా... ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు. 

ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ క్యాన్ తో  ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్లినట్టుగా  పోలీసులు గుర్తించారు.  వీరిద్దరూ దాడికి పాల్పడిన తర్వాత ఎక్కడికి వెళ్లారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.