రాజకీయ రంగ ప్రవేశం గురించి పక్కా వ్యూహంతో వ్యవహరిస్తూ వస్తున్న ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బిఎస్పీ నుంచి ఆహ్వానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన ఇంకా ఆ విషయంపై నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
హైదరాబాద్: ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి రావడానికే తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కొత్త పార్టీ పెడుతారా, ఏదైనా పార్టీలో చేరుతారా అనేది మాత్రం స్పష్టత లేదు. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉన్న సంబంధాల వల్ల టీఆర్ఎస్ నుంచి హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారాన్ని ఆయన సన్నిహిత వర్గాలు కొట్టిపారేస్తున్నాయి.
మాయావతి నాయకత్వంలోని బహజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి ప్రవీణ్ కుమార్ కు ఆహ్వానం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనను తెలంగాణ బిఎస్పీ అధ్యక్షుడిగా చేసేందుకు మాయావతి ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. దనిపై ఆయన ఏ విధమైన నిర్ణయం కూడా తీసుకోలేదు.
మరోవైపు తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించే ఆలోచన కూడా ఆయనకు ఉన్నట్లు సమాచారం. రాజకీయ పార్టీ పెడితే మాత్రం ఆయన తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది. చాలా కాలంగా ఆయన స్వీయారో సంస్థను నడిపిస్తున్నారు. సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో చదివినవారితో ఆయన దాన్ని నడిపిస్తున్నారు. ఫూలే, అంబేడ్కర్ భావజాలాన్ని అందించడానికి ఆయన దాన్ని వాడుతున్నారు.
ఆ సంస్థ శాఖలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఉంటారు. దీని సభ్యుల సంఖ్య దాదాపు 50 వేలు ఉంటుందని ఓ అంచనా. చాలా మంది దళిత, బహుజన, బలహీనవర్గాలకు నైతిక స్థైర్యాన్ని అందించడంలో ఆయన ఐపిఎస్ అధికారిగా ఉంటూనే కృషి చేస్తూ వస్తున్నారు.
ప్రవీణ్ కుమార్ బిఎస్పీలో చేరుతారా, కొత్త పార్టీని పెడుతారనే అనే విషయంపై ఓ వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆయన స్వీయారో పేరుతో ఓ పత్రికను కూడా నడుపుతున్నారు. చాలా కాలంగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆలోచన చేస్తున్నారు. స్పష్టమైన సైద్ధాంతిక భూమికతో ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు.
ప్రవీణ్ కుమార్ 1995 బ్యాచ్ ఐపిఎస్ అాధికారి. దాదాపు దశాబ్ద కాలంగా ఆయన తెలంగాణ సామాజిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యా సంసథల సొసెటీ కార్యదర్శిగా డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నారు. ఆయనను పలుమార్లు హిందూ సంస్థలు లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశాయి. హిందూ దేవుళ్ల మీద ప్రమాణం చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు.
