సారాంశం

ఆర్మూర్ నియోజకర్గంలో బిఆర్ఎస్ పార్టీని ఓడించడం ప్రతిపక్షాలకు సాధ్యం కాదని... ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేస్తున్న అభివృద్దే ఆయనను గెలిపిస్తుందని ఎమ్మెల్సి కవిత అన్నారు. 

ఆర్మూర్ : బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిపై పోటీచేసి ఓడిస్తానంటూ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ గతంలో ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సవాల్ పై తాజాగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డిని ఓడించడం ప్రతిపక్షాలవల్ల కాదని... ఆయనపై పోటీ చేసేవారు మైసమ్మ ముందు బలివ్వడానికి కట్టేసిన మేకపోతులాంటివారని ఎద్దేవా చేసారు. కాబట్టి గెలిచే అవకాశాలు లేనిచోట పోటీచేసి ఓటమిని కొనితెచ్చుకోవడం కంటే ఆశలు వదిలేసుకుంటే మంచిదని ప్రతిపక్ష నాయకులకు కవిత సూచించారు. 

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని మాక్లూర్ మండలకేంద్రంలో జరిగిన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డితో కలిసి కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపైనే వున్న స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కవిత ప్రశంసలు కురిపించారు. ఎంతో అద్భుతంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే ఆర్మూరును అభివృద్ది పథంలో నడిపిస్తున్నారని అన్నారు. కాబట్టి జీవన్ రెడ్డి గత ఎన్నికల్లో కంటే భారీ మెజారిటీతో ఈసారి గెలవడం ఖాయమని కవిత అన్నారు.  

బిఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, సంక్షేమం ప్రతి ఇంటికి అందుతున్నాయని కవిత అన్నారు. గతంలో ఇదేం పార్టీ అంటూ అవహేళన చేసినవారు ఈ పాలన చూసి నివ్వెరపోతున్నారని అన్నారు. బిఆర్ఎస్ కార్యకర్తల త్యాగఫలమే తెలంగాణ ప్రజలకు అందిస్తున్న పథకాలని కవిత అన్నారు. 

Read More  చేరికల్లేవు .. తెలంగాణలో ఇది బీజేపీ పరిస్ధితి, ఈటలే చెప్పారు : హరీశ్ రావు వ్యాఖ్యలు

బిఆర్ఎస్ కార్యకర్తల స్వేధమే తెలంగాణ చెరువుల్లో నిండిన నీరు... వారి త్యాగఫలమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కవిత అన్నారు. బిఆర్ఎస్ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదు... తెలంగాణ ప్రజల ఆవేదన, కష్టాలు చూసి పుట్టిన పార్టీ అని అన్నారు. కాబట్టి ప్రజాసేవ చేయడం తప్ప రాజకీయాలు తెలియని పార్టీ బిఆర్ఎస్ అని కవిత పేర్కొన్నారు.  

తెలంగాణలో మాదిరిగానే దేశ ప్రజలందరికీ సుపరిపాలన అందించాలనే బిఆర్ఎస్ పార్టీని విస్తరణకు కేసీఆర్ పూనుకున్నారని కవిత తెలిపారు. పదవుల కోసం కాదు ప్రజల కోసమే బిఆర్ఎస్ ముందుకు వెళుతుందని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ అవకాశాలు, పదవులు వస్తాయని అన్నారు. కాబట్టి పదవుల కోసం ఆలోచించకుండా కేసీఆర్ లక్ష్యాన్ని, బిఆర్ఎస్ ఆశయాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని నాయకులు, కార్యకర్తలకు కవిత సూచించారు.