బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం.. బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. తాజాగా బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అవుతున్నట్లు ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వంలోని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ దాదాపు పదేళ్లపాటు పాలన సాగించింది. 2014, 2018 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీఆర్‌ఎస్ పార్టీ.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. రెండుసార్లు ఘన విజయం సాధించిన కేసీఆర్ పార్టీ... మూడోసారి తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో 38 సీట్లకు పరిమితమైంది. 65 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఇక్కడి నుంచే అంతా మారిపోయింది. తెలంగాణలో బీఆర్ఎస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సొంత పార్టీకి రోజుకో ట్విస్టు ఇస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు... బీఆర్ఎస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు వరుసగా కారు దిగిపోతున్నారు. ఇప్పటికే 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతులెత్తేసింది. కనీసం ఒక్కటంటే ఒక్క లోక్‌సభ స్థానం కూడా గెలవలేదు.
ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో బీఆర్‌ఎస్‌ని విలీనం చేయబోతున్నారని ప్రచారం మొదలైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవంతో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన బీఆర్‌ఎస్ లోక్‌సభలో ప్రతినిధ్యం కోల్పోయింది. మిగిలిన రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తారని వార్తలు వినిపించాయి. అయితే, ఈ ప్రచారాన్ని బీఆర్‌ఎస్ ఎంపీలు ఖండించారు. నలుగురు బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు ఒట్టి పుకారేనని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత సురేష్ రెడ్డి కొట్టిపారేశారు. బీజేపీలో బీఆర్ఎస్‌ని విలీనం చేస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
ఈ వార్తలపై కేంద్ర మంత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. భారతీయ జనతా పార్టీలో బీఆర్‌ఎస్ విలీనమంటూ జరుగుతున్న ప్రచారం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డ్రామాల్లో భాగమేనన్నారు. బీఆర్‌ఎస్‌ని కాపాడుకునేందుకు కేసీఆర్..... నిరుద్యోగుల ఆందోళనలు, రైతుల ఆత్మహత్యలు, హామీల అమలు వైపు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. అసలు బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకేంటని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఓ మంచి నాయకుడంటూ ప్రశంసలు కురిపించారు. కేసీఆర్, కేటీఆర్‌పై వ్యతిరేకత ఉంది కానీ, హరీశ్ రావుపై మాత్రం ప్రజల్లో మంచి పేరు ఉందన్నారు. అయితే, హరీశ్ రావు బీజేపీలోకి రావాలన్నా పదవికి రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఏ ఎమ్మెల్యే బీజేపీలోకి రావాలన్నా ఇలా చేయాల్సిందేనని చెప్పారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతుంటే.. కాంగ్రెస్‌లో చేరిన వారితో రాజీనామా చేయించి ప్రజాతీర్పు కోరాలని సవాల్ విసిరారు.