అసాధ్యమన్న రుణమాఫీ ఎలా సాధ్యం..! నిజంగానే కేటీఆర్ చెప్పినట్లే రేవంత్ చేసారా..!!

కేసీఆర్ ప్రభుత్వం అన్ని అప్పులే మిగిల్చిందని... లంకె బిందెలు వుంటాయనుకుంటూ ఖాళీ ఖజానా కనిపిస్తోందని సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి అన్న మాటలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా వుంటే రుణమాఫీ ఎలా సాధ్యమవుతోంది..? ఈ రుణమాఫీకే కేటీఆర్ ఇంట్రెస్టింట్ కామెంట్స్... 

BRS Leader KTR comments on Farmer Loan Waiver in Telangana AKP

Rythu Runa Mafi : తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం మూడు విడతల్లో రాష్ట్రంలో అర్హులైన రైతులందరికి రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే మొదట లక్ష రూపాయల రుణాలను మాఫీ చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్దమయ్యింది... జూలై 18న అంటే ఇవాళే ఈ పని చేయనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రుణమాఫీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించనున్నారు... ఇందుకోసం ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. 

అయితే ప్రస్తుత తెలంగాణ ఆర్థిక పరిస్థితిని బట్టి రైతు రుణమాఫీ అసాధ్యమని చాలామంది భావించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన్నంగా వుందని...  లంకె బిందెలు వుంటాయనుకుంటే ఖజానా ఖాళీగా వుందని అన్నారు. దీంతో ఇక ఎన్నికల హామీలను నెరవేర్చడం కష్టమేనని... రైతు రుణాల మాఫీ అసాధ్యమనేలా బిజెపి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి నాయకులు సైతం అభిప్రాయపడ్డారు. కానీ ఏం చేసారో ఏమో తెలీదుగాని ఖాళీగా వుందన్న ఖజానాలో వేలకోట్లు జమచేసి సాధ్యం కాదనుకున్న రూ.2 లక్షల రుణమాఫీని సాధ్యం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. 

రైతు రుణమాఫీపై కేటీఆర్ కామెంట్స్ : 

రేవంత్ సర్కార్ రైతు రుణమాఫీపై మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేసారు. రుణమాఫీ పేరిట తెలంగాణ రైతాంగానికి రేవంత్ మేలు చేయడం లేదు... మోసం చేస్తున్నాడని కేటీఆర్ అన్నారు. రైతుల డబ్బులనే తిరిగి వారికి ఇస్తూ రుణమాఫీ కలరింగ్ ఇస్తున్నాడని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రతి రైతుకు రైతు భరోసా ఇచ్చింది... కానీ కాంగ్రెస్ మాత్రం అలా చేయలేదన్నారు. చాలామంది రైతులకు రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదు. ఇలా రైతు భరోసా నిధుల్లోంచే రూ.7,000 కోట్లు మళ్ళించి రుణమాఫీ నాటకానికి తెర తీసారని కేటీఆర్ ఆరోపించారు. 

ఇక ఈ రుణమాఫీ ప్రక్రియ కూడా సరిగ్గా చేపట్టడంలేదని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల పైచిలుకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకున్నారని కేటీఆర్ తెలిపారు. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం 11 లక్షల మందినే ఎంపికచేసింది... మిగతా రైతుల పరిస్థితి ఏమిటి అని కేటీఆర్ ప్రశ్నించారు. 

గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు రుణమాఫీ చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేసారు. మొదటిసారి 2014, రెండోసారి 2018 లో రైతు రుణమాఫీ చేసామని... ఇలా కేసీఆర్ సర్కార్ రుణమాఫీతో పోలిస్తే కాంగ్రెస్ చేసేది పావు వంతేనని అన్నారు. 2014 లోనే లక్షలోపు రుణాల మాఫీకి రూ.16,144 కోట్లు వెచ్చించాం... సుమారు 35 లక్షల రైతులకు లబ్ది చేకూర్చామన్నారు. ఇక 2018లో కూడా లక్షలోపు రుణమాఫీకి రూ. 19,198 కోట్లు, లబ్దిదారుల సంఖ్య సుమారు 37 లక్షలుగా వుందని కేటీఆర్ తెలిపారు. మరి ఇప్పుడు కేవలం 11 లక్షలమందికే రుణమాఫీ అంటున్నారు? ఇదేంటని కేటీఆర్ ప్రశ్నించారు. 

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు ప్రతి రైతుకు రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేసారు. అర్హులైన రైతులకు రుణమాఫీ అందలేదంటే వారి తరపున పోరాడతామని హెచ్చరించారు. ఇక రైతు భరోసాలో కూడా అర్హులైన ప్రతి రైతుకు అందివ్వాలని కేటీఆర్ కోరారు. 

 మాజీ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతు రుణమాఫీపై మాట్లాడుతూ... పదేళ్ల కిందటే అంటే 2014 లో లక్ష రూపాయల రుణమాఫీకి 17వేల కోట్లు ఖర్చయ్యిందని తెలిపారు. అలాంటిది 2014 లో రూ.6,800 కోట్లతో రుణమాఫీ ఎలా సాధ్యం..? లక్షలోపు రుణాలున్న రైతులు కేవలం 11 లక్షల మందే వున్నారా? అని ప్రశ్నించారు. అసలు లక్ష వరకు రుణం తీసుకున్న రైతులు ఎంత మంది ? రూ.2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులు ఎంత మంది ? రూ.2 లక్షల రుణం మాఫీ చేయడానికి  ఎంత అవుతుంది ? అనేది ప్రభుత్వం వివరించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేసారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios