హైదరాబాద్: బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ తల్లిదండ్రులకు సికింద్రాబాదు కోర్టులో చుక్కెదురైంది. భార్గవ్ రామ్ తల్లిదండ్రులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను సికింద్రాబాదు కోర్టు కొట్టేసింది. మరోసారి భార్గవ్ రామ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. గతంలో ఓసారి ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.  

భార్గవ్ రామ్ తల్లిదండ్రులు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా సికింద్రాబాదు కోర్టు కొట్టేసింది. అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా కోర్టు కొట్టేసింది. ఈ కేసులో ఇంకా కొంత మందిని అరెస్టు చేయాల్సి ఉందని, జగత్ కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. 

ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను తోసిపెచ్చింది. ఇప్పటి వరకు అరెస్టయిన 15 మంది బెయిల్ పిటిషన్లపై విచారణను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేసింది. 

హైదరాబాదులోని మియాపూర్ సమీపంలో గల హఫీజ్ పేటలో రూ.2 వేల కోట్ల విలువైన 48 ఎకరాల భూమి వివాదంలో అఖిలప్రియ ప్రోద్బలంతో కొందరు వ్యక్తులు ప్రవీణ్ రావు సోదరులను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.